కేసీఆర్ కేబినెట్ లోకి సండ్ర! టీడీఎల్పీ విలీనంతో క్లియర్
posted on Apr 8, 2021 @ 11:59AM
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు త్వరలో ప్రమోషన్ దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన చోటు ఖాయమైందని చెబుతున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే యోచనలో ఉన్న గులాబీ బాస్.. సండ్రకు సంకేతమిచ్చారనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి సత్తుపల్లిలో విజయం సాధించారు సండ్ర. రాష్ట్రమంతా కేసీఆర్ హవా వీచినా... సత్తుపల్లిలో సండ్ర ఘన విజయం సాధించారు. తనతో పాటు అశ్వారావుపేటలో మచ్చా నాగేశ్వవరావును గెలిపించుకున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారం చేపట్టాకా టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే సండ్ర ఒక్కరే టీఆర్‌ఎస్‌లో చేరారు.ఆయన కూడా అధికారికంగా గులాబీ కండువా కప్పుకోకుండా... మద్దతు ఇస్తూ వచ్చారు. మరో ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు టీడీపీలోనే ఉండటంతో.. టీడీపీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడానికి సాంకేతికంగా ఇబ్బంది వచ్చింది. దీంతో ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూనే.. పార్టీపరంగా టీఆర్‌ఎస్ మద్దతుదారుడిగా ఉన్నారు సండ్ర వెంకట వీరయ్య. మచ్చాను టీఆర్ఎస్ లోకి తీసుకురావడానికి సండ్ర ప్రయత్నించినా... ఆయన అంగీకరించకపోవడంతో టీడీఎల్పీ విలీనం జరగలేదు.
ఇటీవల అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో సీనియర్ నేత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సండ్ర పలుసార్లు మంతనాలు జరిపారని తెలుస్తోంది. సండ్ర మొదటి నుంచి తుమ్మల అనుచరుడిగానే ఉన్నారు. గతంలో సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు తుమ్మల. ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో సండ్రను నిలబెట్టి గెలిపించుకున్నారు. తుమ్మల టీఆర్ఎస్ లో ఉన్నా సండ్ర ఆయనతో సంబంధాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో సండ్ర, తుమ్మల కలిసే.. మచ్చాతో మంతనాలు సాగించి కారెక్కించారని చెబుతున్నారు. సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శాసనసభ స్పీకర్‌కు లేఖ ఇవ్వడంతో టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం అధికారికంగా జరిగిపోయింది.
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు సండ్ర వెంకట వీరయ్య. సత్తుపల్లి నుంచి ఆయన మూడోసారి గెలిచారు. సీఎం కేసీఆర్ తో సండ్రకు మంచి సంబంధాలున్నాయి. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ దాదాపుగా స్వీప్ చేసింది. దీంతో ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటానని గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా గెలుపులో సండ్ర కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో పల్లాకు ఎక్కువ ఓట్లు వచ్చేలా కష్టపడ్డారని అంటున్నారు. ఈ అంశాలన్ని బేరీజు వేసుకున్న కేసీఆర్.. సండ్రకు ప్రమోషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
కేసీఆర్ పురమాయించడం వల్లే.. మచ్చాతో మాట్లాడి ఆయన టీఆర్ఎస్ లో చేరేలా సండ్ర పావులు కదిపారని అంటున్నారు. ఇప్పుడు సాంకేతిక సమస్యలు కూడా లేకపోవడంతో సండ్రను కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే కేబినెట్ మార్పుల్లో ఆయనకు బెర్త్ ఖాయమంటున్నారు. సండ్రకు మద్దతుగా తుమ్మల కూడా కేసీఆర్ తో చర్చించారని చెబుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఖాళీలు లేవు. దళిత కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు. ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆర్... అతన్ని తప్పించి సండ్ర వెంకట వీరయ్యను తీసుకోవాలని నిర్ణయించారని చెబుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సండ్రను కేబినెట్ లోకి తీసుకోవడం వల్ల.. తెలంగాణలో మెజార్టీగా ఉన్న ఆ వర్గ ప్రజల మద్దతు పొందవచ్చని కేసీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది.