బెంజి కారుతో రోజాకు కొత్త తలనొప్పి
posted on Aug 10, 2022 @ 11:45AM
గత చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో నగరి ఎమ్మెల్యే రోజక్కకు తిప్పలు తప్పలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ బంపర్ మెజార్టీతో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే జగనన్న రాజ్యంలో కూడా ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు తిప్పలు కుప్పలు తెప్పలుగా పెరిగాయట. ఈ మూడేళ్ల కాలంలో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోతోన్నారట.
రోజా.. వెండి తెర మీద హీరోయిన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా.. బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరించినా.. ఆ క్రమంలో విమర్శలు వచ్చినా.. ఆరోపణలు వచ్చినా అవి ఇలా వచ్చి.. అలా టచ్ చేసి అలా వెళ్లిపోయేవి. కానీ ఇటీవల రోజా తన కుమారుడు కృష్ణ కౌశిక్ బర్త్‌డే గిఫ్ట్‌గా అక్షరాల కోటిన్నర రూపాయిలు పెట్టి మెర్సిడెస్ బెంజ్ కారు కోనిచ్చారు. ఆ కారు.. ఏ మూహుర్తాన కొన్నారో కానీ.. నాటి నుంచి ఆర్కే రోజాపై ఇటు విపక్షం.. అటు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు.. ఏడు కార్లు ఉన్నాయని క్లి ఆర్కే రోజా లెక్కలు కట్టి అణాపైసాలతో సహా చెప్పారని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.
ఆ లెక్కలు చెప్పిన ఆర్కే రోజా కారు కోనుగోలు కోసం చేసిన కోటిన్నర నగదు ఎలా వచ్చాయో కూడా చెప్పాలని సామాజిక మాధ్యమం సాక్షిగా ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల సందర్భంగా ఆర్కే రోజా సమర్పించిన అఫిడవిట్ సైతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. రోజా.. ఏపీఐఐసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి.. మంత్రిగిరినే పట్టేసిన తర్వాత... సచివాలయం సాక్షిగా కలెక్షన్ క్వీన్ అవతారం ఎత్తారన్న చర్చ, విమర్శ.. రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకుంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై ఆర్కే రోజా స్పందిస్తూ.. కౌంటర్లు ఇస్తున్నా.. ఆమెపై వస్తున్న ఆరోపణలకు మాత్రం పుల్‌స్టాప్ పడడం లేదు.
అంతేకాదు.. ఆర్కే రోజా ఇస్తున్న సమాధానాలకు.. అటు టీడీపీ నేతలే కాదు.. ఇటు నెటిజన్లు సైతం కౌంటర్లు ఇస్తూ మరింత ఇరుకున పెడుతున్నారు. మరో వైపు పర్యాటక శాఖ మంత్రిగారికి బెంజి కారు.. రిషి కొండ గిఫ్ట్ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ విమర్శలు ఇలా ఉండగా మరోవైపు.. తన సొంత నియోజకవర్గం నగరిలో కూడా రోజాకు అసమ్మతి సెగ.. నాగు పాము బుసలు కొట్టినట్లు కొడుతోందట. మంత్రి వర్గ సహచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ప్రస్తుతానికి రోజా విషయంలో సైలంట్ గానే ఉన్నా.. అది తుపాను ముందు ప్రశాంతత వంటిదని రోజా వర్గీయులే అంటున్నారు.
అలాగే మరోవైపు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరూ రోజాకు పట్టపగలే చుక్కులు చూపించేశారనీ, సొంత పార్టీ అధికారంలో ఉన్నా.. తాము చేసిన పనులకు బిల్లులు పెట్టుకున్నా నగదు రావడం లేదని.. పనుల కోసం అప్పు చేసి.. వాటిని తీర్చలేక వడ్డిలకు వడ్డీలు కడుతూ.. ఆస్తులు ఆమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారంతా ఆర్కే రోజా ముందు ఏకరువు పెడుతుండటంతో వారిని సముదాయించలేక రోజా తల ప్రాణం తోకకు వస్తోందని బాధపడుతున్నారట. కార్యకర్తల బాధలు వినేందుకు తాను ఉన్నాననీ, తన బాధలు వినేందుకు ఎవరున్నారనీ చెబుతూ వారిని సముదాయించుకువస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.