కమలం నీడలోకి జయసుధ!
posted on Aug 10, 2022 @ 11:50AM
ఆశించిన మార్పు జరిగితే ఉండే ఉత్సాహం వేరే లెవెల్. ఇపుడు భారతీయ జనతాపార్టీది అదే స్థితి. మునుగోడు ఉప ఎన్నిక జరిగే వరకూ కమలనాధుల ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహాలన్నీ అటుకేసే పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ నియోజకవర్గంలో ఈ నెల 21న కేంద్రమంత్రి అమిత్ షా బహిరంగ సభ జరుగనుంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని బీజేపీ తెలంగాణా నాయకులు, అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పార్టలోకి చేరేవారికి రెడ్ కార్పెట్ వెల్‌కమ్ చెబుతున్నారు. మునుగోడు కేంద్రంగా తెలంగాణాలో రాజకీయాలను ఉరకలు వేయించాలని బీజేపీ వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తోంది. అభిమానుల్లోనూ జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. టీఆర్ ఎస్, కాంగ్రెస్ సీనియర్లను గాలం వేసి లాగే యత్నాలు మరింత ముమ్మరం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశంలో ఆయన ముందు వారిని పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఆయన ముందు తెలంగాణా బీజెపీ కార్యకర్తలు, నాయకులు అందరూ బండి సంజయ్ నాయకత్వం ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ప్రదర్శించాలన్న ఆతృతనూ ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ సినీ నటి జయసుధ బీజేపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
అలాగే సీనియర్ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీనటి జయసుధ, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సినీ నిర్మాతతో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మంతనాలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వివరించాయి. జయసుధ 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
కాగా, బీజేపీలో చేరాలన్న ఆ పార్టీ నేతల ప్రతిపాదనపై జయసుధ ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదని కమలం వర్గాలు పేర్కొన్నాయి. తనకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి విస్పష్ట హామీ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రతినిధి తేజావత్ రామచంద్రునాయక్‌తోనూ బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు సీనియర్ నేతలతో, ఉద్యమకారులతో బీజేపీ చేరికల కమిటీ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.