ఎన్డీఎ ఖాళీ.. శుభం కార్డు పడినట్లేనా?
posted on Aug 10, 2022 @ 11:25AM
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ) కథ ముగిసినట్లేనా? ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎ చిత్రానికి శుభం కార్డు పదినట్లేనా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఇంతవరకు జాతీయ స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోని జనతా దళ్ (యు) కూటమిలో కొనసాగడంతో, జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఉనికి ఉందని పించుకుంది. ఇప్పుడు, కొంచెం ఆలస్యంగానే అయినా పులి మీద స్వారీలోని ప్రమాదాన్ని గుర్తించి నితీష్ కుమార్, కూటమికి గుడ్ బై చెప్పడంతో, ఎన్డీఎ కథ కంచికి చేరినట్లే అంటున్నారు.
నిజానికి, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ చివరి పేజికి చేరింది. ఇంచు మించుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కు 10 సీట్లు అదనంగా (282) గెలిచి, మూడు పదుల చరిత్రను తిరగ రాసింది. అలాగే, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరే పరిస్థితికి చేరుతోంది.
అయినా 2014లో తిరిగి 2019లో బీజీపీ ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చాయి. ఆ క్రమమలోనే ఇప్పుడు జేడీ(యు) వంతు వచ్చింది.
2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు కలిసి పోటీచేశాయి. కానీ, ఇప్పుడు ఆ చిన్నా చితక పార్టీలలో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్’ తాజాగా జేడీ(యు) సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఎన్డీఎ గూడు వదిలి పోయాయి.. ఇక ఇప్పుడు ఎన్డీఎలో ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా అంతగా ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు. ఏ పార్టీకి కూడా లోక్ సభలో ఒకటి రెండు స్థానాలకు మించి లేవు.
అయితే, మిత్ర పక్షాలు బీజేపీకి ఎందుకు దూరం అవుతున్నాయి? బీజేపీతో చెలిమిని మిత్ర పక్షాల ఎందుకు దృతరాష్ట్ర కౌగిలిగా భావిస్తున్నాయి? బీజేపీకి మిత్ర పక్షాలు దురమవుతున్నాయా? లేక బీజేపీనే ఉద్దేసపూర్వకంగా మిత్ర పక్షాలను పోమ్మనకుండా పొగబెట్టి, సాగనంపుతోందా? మిత్ర పక్షాలు మోడీ, షా జోడీ రాజాకీయ వ్యూహ చతురతను తట్టుకోలేక చక్రబంధాలను చేదించుకుని బయట పడుతున్నారా? అంటే,ఇదమిద్దంగా ఇదీ కారణం అని చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది.
ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. తెలుగు దేశం పార్టీ బయటకు వచ్చిన కారణాలకు, ఇప్పుడు నితీష్ కుమార్ బయటకు వెళ్ళిన కారణాలకు పొంతన లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం ప్రకటించి బయటకు వచ్చారు. చంద్రాబాబు రాజకీయ ప్రయోజనాలు చూసుకోలేదు.కానీ, నితీష్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని, కమల దళానికి కతీఫా చెప్పలేదు. బీజేపీ చెలిమి భస్మాసుర హస్తం అవుతోందన్న భయంతోనే ఆపర్తితో తెగతెంపులు చేసుకున్నారు. అలాగే, అకాలీ దళ్, శివసేన ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క క(వ్య)థ.
అయితే, ఒకటి మాత్రం నిజం, మోడీ, షా జోడీ నాయకత్వంలో బీజేపీ శతృమిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలను,‘సమ’ దృష్టితో చూస్తోంది. అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్ధులుగానే చూస్తున్నారు. అందుకే మోడీ, షా జోడీ అడుగులు ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం వైపుకు సాగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ఒక విధంగా మోడీ,షా జోడీ రాజకీయ అశ్వమేధ యాగం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్’ లక్ష్యంగా మొదలు పెట్టిన ఈ యాగం కాంగ్రెస్ కథ ముగింపుతో ముగిసేలా లేదని జరుగుతున్నపరిణామాలు, నడుస్తున్న చరిత్ర స్పష్టం చేస్తున్నాయి.
అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యం నడిచే రోజుల్లో, హస్తం పార్టీ కూడా ఇవే పోకడలు పోయింది. ఒక దశలో ఇందిరాగాంధీ, ప్రతిపక్ష్లాల గొంతు నొక్కేందుకు ఏకంగా దేశంలో అత్యవసర పరిస్థితినే విధించారు. ఇప్పుడు ఆ పరిస్థతి పునరావృతం అయ్యే అవకాసం లేదు కానీ, అధికార ఇదే ధోరణి, ఇవే పోకడలు కొనసాగితే ప్రజవామ్య వ్యవస్థ వొడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుందని అయితే, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.