జగన్ సర్కార్ కు మరో పరాభవం.. ఆర్5 జోన్ లో ఆగిన ఇళ్ల నిర్మాణం
posted on Aug 3, 2023 @ 10:55AM
కింద పడినా పై చేయి నాదే అంటూ జగన్ సర్కార్ ఎంతగా మొండికేసినా ముందడుగు వేసే అవకాశాలు లేకుండా కోర్టు తీర్పులు గట్టి బంధనాలనే వేశాయి. ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణం విషయంలో తీర్పులకు వక్రభాష్యం చెప్పి మరీ తొడగొట్టి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామంటూ ఘనంగా ప్రకటించుకుని.. సాక్షాత్తూ సీఎం జగనే శంకుస్థాపన చేసినా.. అక్కడ ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. హైకోర్టు ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది.
అక్కడ ఇళ్ల నిర్మాణాన్నితక్షణమే నిలిపివేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూమిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చట్ట విరుద్ధమన్న అంశంపై కేసులు ఉన్నాయి. అన్నిటికీ మించి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనే లేదు. అంటే అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. హైకోర్టు తీర్పులో ఈ విషయం విస్పష్టంగా ఉన్నా జగన్ సర్కార్ సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసి మరీ ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసింది. పేదల పేరుతో ఎక్కడెక్కడో ఉన్న ఓటు బ్యాంక్‌కు సెంటు స్థలాలు పంపిణీ చేసి శంకుస్థాపన కూడా చేసేసింది.
అయితే జగన్ సర్కార్ చెబుతున్నట్లుగా కాకుండా సుప్రీంకోర్టు ఇంటి స్థలాలు పంపిణీ చేయవచ్చు కానీ లబ్ధిదారులకు చట్టబద్దమైన అధికారం దఖలు పడదని.. తుది తీర్పుకు లోబడే ఆ హక్కు దఖలు పడేదీ లేనిదీ ఆధారపడి ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు ఇళ్ల పట్టాలపై స్పష్టంగా పేర్కొన్న మిదటే వాటిని పింపిణీ చేయాలని ఆదేశించింది. అయితే జగన్ సర్కార్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన పట్టాలపై కేవలం స్టిక్కర్లు అంటించింది. ఆర్ 5 జోన్‌లో ఉన్న భూమిపై ధర్డ్ పార్టీకి భూమిహక్కులు బదలీ అవ్వవు. కోర్టు తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నా జగన్ సర్కార్ మాత్రం పేదలకు భూమి పంపిణీ అంటూ కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే.. పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసేసింది.
జగన్ సర్కార్ అధికారంలో ఉన్న నాలుగేళ్ల పైచిలుకు సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడా ఇళ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకే రంగులు వేసి హడావుడి చేయడానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. అయితే అమరావతి విషయంలో మాత్రం ఇళ్ల నిర్మాణానికి ఎక్కడ లేని హడావుడీ ప్రదర్శిస్తోంది. అయితే అమరావతిలో జగన్ సర్కార్ ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి నిధులిచ్చేది లేదని కేంద్రం తేల్చేసినా జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరాయించి ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. ఇప్పుడు సీఎం జగన్ ఆర్భాటంగా కోర్టు తీర్పులను ఉల్లంఘించి మరీ శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. వచ్చే డిసెంబర్ లో రాజధాని కేసులపై విచారణ జరుగుతుంది. అప్పటి వరకూ నిర్మాణాల ప్రారంభానికి వీలులేదు.
పేదలకు ఇళ్లిద్దామంటే అడ్డుకున్నారని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది కానీ ఆర్5 జోన్ లో పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు కూడా తమకు అక్కడ ఇళ్ల నిర్మాణం ఎందుకు తామున్న చోట ఇవ్వొచ్చు కదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలా ఉండగా ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై హై కోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.