అమరావతిలో రాజధానికి బై బై... వైసీపీ నేతల వైఖరితో వీడని కన్ఫ్యూషన్
posted on Dec 16, 2019 @ 1:43PM
రాజధాని పై సందిగ్ధం కొనసాగుతోంది. కొద్ది నెలల క్రితం మంత్రి బొత్స వ్యాఖ్యలతో మొదలైన గందరగోళం కంటిన్యూ అవుతోంది. రాజధాని నిర్మాణాల్లో అవినీతి జరిగిందని తమ ప్రభుత్వం త్వరలోనే క్యాపిటల్ పై తగిన నిర్ణయం తీసుకొంటుందని బొత్స చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపాయి. రాజధాని గెజెట్ ఎక్కడుందన్న బొత్స వ్యాఖ్యలతో తరలించడం కాయమన్న ప్రచారమూ జరిగింది. క్యాపిటల్ పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి, సింగపూర్ కూడా ఒప్పందం నుంచి తప్పుకుంది. దీంతో సహజంగానే రాజధానిపై గందరగోళం ఇంకా పెరిగింది. కేంద్రం ప్రచురించిన న్యూ ఇండియా మ్యాప్ లో ముందుగా అమరావతి పేరు లేకపోవటం తరువాత చేర్చటం అంతా అయోమయం సృష్టించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, శాసన మండలిలో ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం రాజధాని వాసుల్లో ఆశలు రేకెత్తించింది.
ఏపీ క్యాపిటల్ అమరావతినేనని మార్పు ఆలోచనే లేదని టిడిపి సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స. దీంతో రాజధాని అమరావతినే అంటూ ప్రచారం జోరందుకుంది, అయితే ఆ సమాధానం అప్పటి వరకు ఉన్న పరిస్థితి మాత్రమేనని దానికి అనుబంధంగా ప్రశ్నలొస్తే ఇంకొంచం సమాదానం ఇచ్చేవాడినని మరో బాంబు పేల్చారు బొత్స. ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక ప్రకారమే నిర్ణయం ఉంటుందని తేల్చేశారు. పైగా అసెంబ్లీ సమావేశాలున్నాయి కాబట్టి అన్ని విషయాలూ బయటకు చెప్పలేమంటూ క్యాపిటల్ పై కన్ఫ్యూజన్ మరింతపెంచారు. ఆయనే కాదు పార్టీల నాయకులది అదే మాట, నిపుణుల కమిటీ నివేదిక తర్వాతే క్యాపిటల్ ఫైనల్ అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, చీఫ్ శ్రీకాంత్ రెడ్డి. ఎప్పటికప్పుడు నేతల ప్రకటనలతో రాజధాని పై అనిశ్చితి అయితే కొనసాగుతోంది. అసలు సిఎం జగన్ మనసులో ఏముంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కమిటీ నివేదికలు ఇచ్చినా ప్రభుత్వ పెద్దలు ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి. జగన్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారో కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని పై నిర్ణయం తీసుకుంటారో చూడాలి.