సబితా వర్సెస్ శ్రీలక్ష్మి ...!
posted on Apr 17, 2012 @ 12:06PM
గనులలీజు వ్యవహారంపై జరిగిన అవకతవకలు పాలనాపరమైన అంశంగా కాకుండా క్రమంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిల మధ్య వ్యక్తిగత వివాదంగా మారుతోంది. ఈ ఇరువురు మహిళలను తమతమ స్థాయిలను మరచి నీవు దొంగ ... కాదు నీవే దొంగ అన్నట్టు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఇరువురి ధోరణి చూస్తుంటే గనులు కాదు ... గలీజు వ్యవహారంగా వుంది.
గనులలీజుకు సంబంధించిన జి.వో.లో క్యాపిటివ్ అనే పడం మిస్ కావడానికి అధికారి శ్రీలక్ష్మి కారణమని, బహుశా ఆమె నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఒత్తిడి మేరకు ఆమె అలా చేసి వుండవచ్చునని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రస్తావించినట్టు తెలుసుకున్న శ్రీలక్ష్మి జి.వో. విడుదలలో జరిగిన అవకతవకలన్నింటికీ మంత్రి కారణమని, అయినా గనుల లీజుకు సంబంధించిన జి.వో.లలో ఎక్కడా క్యాపిటివ్ అనే పదం వినియోగించిన దాఖలాలేదని వ్యాఖ్యానించారు. జి.వో. విడుదలలో మంత్రిదే బాధ్యత అని శ్రీలక్ష్మి చెప్పడంలో తప్పులేదు కాని, క్యాపిటివ్ అనే పదం దేశంలో ఎక్కడా వినియోగించలేదన్న కొత్త విషయాన్ని సమస్య ముదిరిన తర్వాత కాకుండా ముందుగానే ప్రకటించి వుంటే బావుండేది. నిజంగా క్యాపిటివ్ అనే పదం ఎక్కడ వినియోగించి వుండకపోతే సిబీఐ అధికారుల విచారణ సమయంలోనే చెప్పి వుండవచ్చు. కాని అందుకు విరుద్ధంగా ఆమె ఆనాడు జి.వో. నమూనా ప్రతి తయారు చేసినప్పుడు క్యాపిటివ్ అనే పదం వుందని, కాని జి.వో. విడుదలైన తర్వాత మాత్రం ఆ పదం ఏ విధంగా ప్రకటించారు. మొత్తంగా అన్నగారిపై ప్రేమతో చేవెళ్ళ చెల్లెమ్మ లేదా స్వామిభాక్తితో నాటి అధికారి శ్రీలక్ష్మి వేలకోట్ల రూపాయల విలువచేసే క్యాపిటివ్ అనే పదాన్ని మింగివేసినట్టు సాధారణ ప్రజలకు కూడా అర్థం అవుతోంది.