ఒంటరి అవుతున్న డిఎల్!
posted on Apr 17, 2012 @ 11:48AM
మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి క్రమంగా ఒంటరి అవుతున్నాడా? అని ప్రశ్నిస్తే అవుననే సమాధానం వస్తుంది. మూడు అలకలు ... ఆరు విమర్శలతో నిరంతరం వార్తలలో వ్యక్తిగా వుండే డిఎల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఏమాత్రం సఖ్యత లేదని తెలుస్తోంది. ఒకదశలో డిఎల్ తనతోపాటు కిరణ్ అంటే వ్యతిరేకత వున్న నేతలను సమీకరించి ఒక వర్గం తయారు చేయాలనే ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఎక్సైజ్ మంత్రి వెంకటరమణపై ఆరోపణలు వచ్చినపుడు రమణకు మద్దతుగా డిఎల్ మాట్లాడారు.
అయితే కిరణ్ కుమార్ రెడ్డి తగిన వ్యూహంతో డిఎల్ తో ఎవరినీ చేరకుండా చేయగలుగుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి డిఎల్ ను పక్కన పెట్టాలనే కోరిక వున్నప్పటికీ డిఎల్ కడపజిల్లాకు చెందినవాడు కావడం, కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేయడం వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా వున్నాయి. పి.ఆర్.పి. విలీనం కాకముందు కడప నుంచి మంత్రివర్గంలో కేవలం డిఎల్ మాత్రమే వున్నారు. పి.ఆర్.పి. విలీనం తర్వాత ఇదే జిల్లాకు చెందిన పి.ఆర్.పి. నేత సి.రా,అచంద్రయ్య శాసనమండలి సభ్యునిగా ఎన్నికకావడంతోపాటు మంత్రిపదవి కూడా లభించింది. ఇటీవల డిఎల్ రవీంద్రారెడ్డి స్వయంగా రామచంద్రయ్య ఇంటికి వెళ్ళి మూడుగంటల పాటు మంతనాలు జరిపారు. ఈ ఆకస్మిక భేటీపై విలేఖరులు ఆరా తీయగా ... కేవలం మర్యాద పూర్వకంగానే రామచంద్రయ్యను కలిసినట్లు డిఎల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, డిఎల్ కు మధ్య ముదిరినవైరం నేపథ్యంలో కేవలం మర్యాదకోసమే కలిశాననే మాటలను ప్రజలు విశ్వసించడం లేదు.