పారిశ్రామికవేత్తలకు కేంద్రమంత్రి పదవులు లభించవా?
posted on Apr 17, 2012 @ 12:18PM
కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యులుగా వున్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు మంత్రిపదవులు లభించవా? అని ప్రశ్నిన్స్తే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా వున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం లభించవనే చెప్పాల్సి వుంటుంది. మన రాష్ట్రంలో కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ వంటి పార్లమెంటు సభ్యులు దీర్ఘకాలంగా రాజకీయాలలో వున్నారు. కావూరి, రాయపాటి వంటివారు అయితే మూడు, నాలుగు పర్యాయాలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కేంద్రంలో మంత్రిపదవి నిర్వహించాలని కూడా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.
అయితే కావూరి, రాయపాటి వంటివారు దీర్ఘకాలంగా రాజకీయాలలో వున్నప్పటికీ వారి ప్రథమ ప్రాధాన్యం వాణిజ్యానికే. వారు వాణిజ్యవేత్తలుగా వుంటూ రాజకీయాలలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన వారికే మంత్రిపదవులు లభిస్తాయని ఒక సీనియర్ కాంగ్రెస్ వేత్త వ్యాఖ్యానించారు.
రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్రమంత్రులుగా పనిచేసిన వారంతా పూర్తికాలం రాజకీయవేత్తలుగా వున్నవారేననే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వాణిజ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి రాజకీయాలలో కొనసాగుతున్నవారికి మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులను కూడా ప్రజలకోసం కాకుండా తమ వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగించడానికే ప్రాధాన్యత ఇస్తారని ఆయన అన్నారు.