ఊహాగానాలు వద్దు మీడియాకు సీబీఐ జేడీ హితవు
posted on Jan 31, 2012 @ 1:42PM
హైదరాబాద్ : మీడియాపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్త పరిచారు. ఆయన ఉదయం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విచారణలో ఉన్నవారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామన్నది అవాస్తవమని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తాము ఇచ్చిన అధికారిక సమాచారాన్నే మీడియాలో ప్రసారం చేయాలని ఆయన సూచించారు. మీడియా ఊహాజనిత వార్తలకు దూరంగా ఉండాలన్నారు.అలాంటి వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై పీఐబీకి లేఖ రాస్తామని ఆయన అన్నారు. నిజంగా ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలన్నారు. తాము ఎవ్వరినీ ఉద్దేశ్య పూర్వకంగా అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. అందరినీ విచారణ కోసమే అరెస్టు చేశామన్నారు. ఆయా కేసుల్లో ఎవరి ప్రమేయముందని తెలిసినా విచారిస్తున్నామని చెప్పారు.
తామెవరిపైనా థర్డ్ డిగ్రీ చర్యలు తీసుకోవడం లేదనీ, అదేవిధంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ విచారణలను కూడా జరపడం లేదని చెప్పారు. నేరం పాల్పడినట్లు అభియోగాలు నమోదైనవారిపై విచారణ జరపడమే తమ విధి అని అన్నారు. సీబీఐ విచారణాంశాలను ఎవరికీ లీక్ చేయటం లేదని స్పష్టం చేశారు.కేసుల విచారణలో ప్రభుత్వం నుంచి మరికొంత సహకారం, సమన్వయాన్ని కోరినట్లు తెలిపారు. మీడియా వారు సీబీఐ విచారణ గురించి ఏదైనా రాసేటట్లయితే నిజం తెలుసుకుని రాయాలని సూచించారు. అంతేతప్ప ఏవో ఊహాగానాలు రాయవద్దని హితవు పలికారు. ఏదైనా జరిగితే తామే ప్రస్ నోట్ ద్వారానో, ఎస్ఎమ్ఎస్ ద్వారానో తెలియజేస్తామని వెల్లడించారు.