జూడాలకు జగన్ బాసట
posted on Jan 31, 2012 @ 2:01PM
హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కార సాధన కోసం గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం సంఘీభావం ప్రకటించారు. ఇందుకోసం ఆయన జూడాలు దీక్ష చేస్తున్న గాంధీ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జూనియర్ల డాక్టర్లు చేస్తున్న డిమాండ్లన్నీ సమంజసమేనని మానవత్వమైనవేనన్నారు. ముఖ్యంగా వారు డిమాండ్ చేస్తున్న స్టెయిఫండ్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందని అందువల్ల జూడాల డిమాండ్‌ను పరిష్కరించాలని ఆయన కోరారు. పిల్లల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. జూడాల దీక్ష ఏడోరోజుకు చేరుకున్నా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవటం దారుణన్నారు. అంతేకాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రోజే మూడో పాయింట్ మినహా జూనియర్ డాక్టర్ల అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.మూడో పాయింట్‌లో కొన్ని సవరణలు మాత్రమే కోరతామన్నారు.ఒక్క కలం పోటుతో వీటిని పరిష్కరించవచ్చునని అన్నారు.
ఆమరణదీక్షతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జూడాలకు ఈ సందర్భంగా జగన్ విజ్ఞప్తి చేశారు. గాంధీ ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతున్న జూనియర్ డాక్టర్లను ఆయన పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించిన రవి అనే జూనియర్ డాక్టర్‌కు వైఎస్ జగన్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.