కిరణ్ ను కడిగిపారేసిన ఫై దాడి
posted on Jan 31, 2012 @ 1:21PM
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి దయమీద బతకడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సిగ్గు లేదా? అని అయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో తనకు జరిగిన అవమానం శాసనమండలికి జరిగినట్లేనన్నారు. ఇది పెద్దల సభకు జరిగిన అవమానమన్నారు. దీనిపై సమావేశాల తొలిరోజే ప్రస్తావిస్తానని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఫోన్లో ఆరా తీస్తారని, కానీ కిరణ్‌కు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందన్నారు. సూట్ కేసులు తీసుకు వస్తేనే క్యాంప్ ఆఫీసులోకి అనుమతిస్తారా? అని మండిపడ్డారు.సోనియా, చిరంజీవి దయతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి ఓ దురహంకారి అని దుయ్యబట్టారు.
సీఎం తీరుకు నిరసనగా బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజున శాసనమండలిలో నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కిరణ్‌కు ఇంత అహంకారం ఉంటే ఎలా అన్నారు. పదవి శాశ్వతం కాదని వ్యక్తిత్వం ముఖ్యమన్నారు. కాగా జూడాల సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు దాడి ఆధ్వర్యంలో టిడిపి నేతలు ఉదయం సిఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ సెక్యూరిటీ దాడిని లోపలకు అనుమతించలేదు. సిఎం పేషీకి సమాచారమందించిన స్పందించలేదు.