ఆరోగ్యానికి రేడు నేరేడు

             

 

ఆయుర్వేదం ప్రకారం మన ఆహారమే గొప్ప ఔషధం. ఆ ఆహారంలోనే మన శరీరానికి అవసరమైన పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన జీవనానికి మార్గం. అందుకే ఏ కాలంలో దొరికే పండ్లనైనా విస్మరించకుండా తినమని సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకో రుతువులో దొరికే పండుకీ ఒకో ప్రాధాన్యత ఉంటుంది. రుతువు మారితే ఆ పండు చేజారిపోవచ్చు. అలా వర్షరుతువులో ధారాళంగా లభించే ఫలం నేరేడు.

 

- నేరేడుకి రకరకాల పేర్లే ఉన్నాయి. అసలు ఆ పేర్లలో ఒకటైన ‘జంబూ’ అన్నదాని మీదుగానే మన ప్రాంతానికి ‘జంబూద్వీపం’ అన్న పేరు వచ్చిందంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేరేడు కేవలం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమైన వృక్షం. ఆ తరువాత కాలంలో మన దేశం నుంచి నేరేడు విత్తనాలను ఐరోపాలకు తీసుకువెళ్లారు. ఇక అమెరికావాసులకైతే 19వ శతాబ్దం వరకూ ఈ చెట్టు పరిచయమే లేదు.

 

- నేరేడు ఫలాలను, దళాలను పూజలో వాడటం తెలిసిందే! అయితే ఔషధరీత్యా కూడా నేరేడు ప్రాశస్త్యం నానాటికీ పెరిగిపోతోంది. ఈపాటికే నేరేడుని హోమియోపతి, ఆయుర్వేదంలో విస్తృతంగా వాడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు నేరేడు డయాబెటీస్‌, రక్తపోటు వంటి సమస్యలలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలియడంతో సాధారణ ప్రజలు కూడా వీటిని ఇష్టపడుతున్నారు.

 

- చాలామంది కేవలం నేరేడు పండ్లు తింటే మధుమేహం తగ్గిపోతుందని భావిస్తారు. నేరేడు పండుకంటే కూడా అందులోని గింజలను ఎండపెట్టుకుని చేసుకునే పొడితో, మధుమేహం నుంచి మరింత ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచి, చక్కెర నిల్వలని అదుపు చేసే సామర్థ్యం ఈ నేరేడు గింజలకు ఉందని సంప్రదాయ వైద్యుల నమ్మకం. ‘సైజీజియం’ అనే శాస్త్రీయ నామంతో కూడిన నేరేడు మందును హోమియోపతిలో మధుమేహాన్ని నివారించేందుకు తప్పక వాడతారు. ఈ మందుని తరచూ తీసుకుంటే చక్కెర నిల్వలు అదుపులోకి రావడమే కాకుండా, మూత్రంలో సైతం చక్కెర కనిపించకుండా పోతుందని భావిస్తారు.

 

- మిగతా పండ్లలోకంటే నేరేడులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. Delphinidin, cyanidin, malvidin... వంటి బోలెడు యాంటీఆక్సిడెంట్లు నేరేడులో ఉన్నాయని చెబుతున్నారు. దీనివల్ల గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడతాయట. పైగా క్యాన్సర్ వంటి జటిలమైన అనారోగ్యాలను సైతం ఎదుర్కొనే సత్తా ఈ యాంటీ ఆక్సిడెంట్లకు ఉందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.

 

- నేరేడులో ఉండే పోషకాలు అసాధారణం! ముఖ్యంగా విటమిన్‌ సి, ఐరన్‌లు ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకూ ఈ రెండూ కూడా దోహదపడతాయి. మరీ ముఖ్యంగా వర్షరుతువుతో పాటుగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడకుండా కాచుకుంటాయి.

 

- జీర్ణవ్యవస్థను సరిదిద్దేందుకు నేరేడు అమోఘంగా పనిచేస్తుందంటారు పెద్దలు. విరేచనాలతో బాధపడేవారికీ, కాలేయం పనితీరుని మెరుగుపరచడానికీ నేరేడు దోహదపడుతుంది.

 

చెప్పుకొంటూ పోతే నేరేడు సుగుణాలకి లెక్కే లేదు. అందుకేనేమో శ్రీరాముడు సైతం, వనవాసంలో ఉన్నప్పుడు ఈ నేరేడు పండ్లను సేవించాడని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. మరి మనమో!

 

- నిర్జర.