వేళ్లు నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యం!

పిల్లలు తల్లి గర్భంలో ఉండగానే వారిలో వేళ్లను నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుందట. కానీ వారు బయట ప్రపంచంలోకి వచ్చి, పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ అలవాటుని మానుకోకపోతే పెద్దలు బెంబేలెత్తిపోతుంటారు. నయానోభయానో తమ పిల్లలలో ఈ అలవాటుని మాన్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం వారిని కొట్టడమో, వేళ్లకి బ్యాండేజీలు చుట్టడమో చేస్తుంటారు కూడా! కానీ ఆశ్చర్యకరంగా... పిల్లల్లో వేళ్లు చీకే అలవాటు మున్ముందు కొన్ని అనారోగ్య సమస్యలని దూరంగా ఉంచుతుందని ఒక పరిశోధన చెబుతోంది.

40 ఏళ్ల పరిశోధన!

పిల్లల్లో వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే దానివల్ల వారి పళ్లు దెబ్బతింటాయనీ, నత్తి వచ్చే ప్రమాదం ఉందనీ... అటు వైద్యులూ, ఇటు తల్లిదండ్రులూ కంగారుపడటం సహజం. కానీ న్యూజిలాండ్‌లో దాదాపు 40 ఏళ్లుగా జరుగుతున్న ఓ పరిశోధన ఇందుకు విరుద్ధమైన ఫలితాలను వెల్లడిస్తోంది. ఈ పరిశోధనలో భాగంగా నిపుణులు 1972-1973 సంవత్సరాల మధ్య పుట్టిన ఒక 1037 మంది పిల్లలను గమనిస్తూ వస్తున్నారు. ఎదుగుతున్న కొద్దీ ఆ పిల్లల్లో ఎలాంటి అలవాట్లు ఏర్పడుతున్నయో నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారిలో 5,7,9,11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరెవరిలో గోళ్లు కొరుక్కోవడం, వేళ్లు చప్పరించడం అనే అలవాట్లు ఉందో పరిశీలించారు.

తరువాతకాలంలో...

తాము పరిశోధన కోసం ఎంచుకున్న పిల్లలకి 13, 32 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వారి మీద కొన్ని పరీక్షలు జరిపారు పరిశోధకులు. ఇందులో భాగంగా దుమ్ముకణాలు, పెంపుడు జంతువులు, ఇంట్లో కనిపించే సూక్ష్మక్రిములు... వంటివాటి నుంచి సదరు పిల్లలకు అలెర్జీలు సోకే అవకాశం ఏమేరకు ఉందో పరీక్షించారు. ఆశ్చర్యకరంగా వేళ్లనీ చీకే అలవాటు ఉన్న పిల్లల్లో అలెర్జీలను ఎదుర్కొనే శక్తి 31 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. పైగా పిల్లల్లో వేళ్లని చప్పరించడంతో పాటుగా, గోళ్లు కొరుక్కునే అలవాటు కూడా ఉంటే వారిలో ఈ నిరోధక శక్తి మరింత అధికంగా కనిపించింది.

కారణం !

మన వేళ్ల మీదా, గోళ్ల లోపలా రకరకాల సూక్ష్మక్రిములు నివాసం ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే చిన్నతనంలోనే వీటికి పిల్లలు అలవాటు పడటంతో, వారిలో సదరు క్రముల పట్ల నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు పరిశోధకులు. అయితే ఏఏ క్రిముల పట్ల ఇలాంటి నిరోధక శక్తి లభిస్తుందో ధృవపరిచే ప్రయత్నంలో ఉన్నారు. అలాగని పిల్లల్లో ఈ అలవాట్లు కనిపిస్తే చూసీ చూడకుండా ఊరుకోవడం మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక వయసు దాటిన పెద్ద పిల్లలు కనుక గోళ్లు కొరుక్కోవడమో, వేళ్లు చప్పరించుకోవడమో చేస్తుంటే తప్పకుండా వైద్యుని సంప్రదించమని చెబుతున్నారు. పెద్ద వయసులో ఇలాంటి అలవాట్లు ఉండటం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందనీ, కొన్ని మానసిక సమస్యలకు కూడా ప్రతిబింబంగా మారుతుందనీ తేల్చి చెబుతున్నారు. కాబట్టి పసి పిల్లల్లో కనుక వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే దానిని మాన్పించే ప్రయత్నం అయితే చేయవచ్చు కానీ.... మరీ బెంబేలెత్తిపోవల్సిన అవసరం మాత్రం లేదన్నమాట!

- నిర్జర.