పేరసెటమాల్‌ క్షేమం కాదా!

 

ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసిన మందు పేరు....  పేరాసెటమాలే అయి ఉంటుంది. అంతేకాదు! ఏ ఇంగ్లిషు మందుని తీసుకున్నా దుష్ప్రభావాలు తప్పవని వాదించేవారు కూడా పేరాసెటమాల్‌ విషయంలో కాస్త సానుకూలంగానే ఉంటారు. అందుకేనేమో పేరసెటమాల్‌ ఇప్పటికీ ఒక ‘Non prescriptive drug’ గానే ఉండిపోయింది. అంటే ఎవరు పడితే వారు మందుల దుకాణానికి వెళ్లి దీన్ని కొనుక్కొని నోట్లో వేసేసుకోవచ్చు. పైగా చాలామంది దృష్టిలో పేరాసెటమాల్ ఒక దివ్యౌషధం. ఇది అటు నొప్పిని (Analgesic) ఇటు జ్వరాన్నీ (Antipyretic) నివారించి పారేస్తుంది. కానీ గత పక్షం రోజులుగా వచ్చిన కొన్ని పరిశోధనా ఫలితాలు... పేరసెటమాల్‌ అనుకున్నంత క్షేమమేనా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

 

సంతానలేమి!

పేరాసెటమాల్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివర్ దెబ్బతింటుదన్నమాట తరచూ వింటున్నదే! అయితే ఒక స్థాయి దాటిన తరువాత పేరాసెటమాల్‌ మగవారిలో సంతానలేమికి కూడా దారి తీస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. సాక్షాత్తూ అమెరికా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడిచే National Institutes of Health (NIH) అనే సంస్థ చేసిన పరిశోధనలో తేలిన విషయం ఇది! ఇందుకోసం వారు 500 పైగా జంటలను నాలుగు సంవత్సరాల పాటు గమనించారు. తరచూ పేరాసెటమాల్ తీసుకునే మగవారిలో, సంతానం కలిగే అవకాశాలు 35 శాతం తక్కువగా ఉన్నాయని తేల్చారు. వీరి మూత్రంలోని పేరాసెటమాల్‌ అవశేషాల ఆధారంగా పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారట. అశ్చర్యకరంగా.... స్త్రీలు పేరాసెటమాల్‌ తీసుకోవడానికీ, వారిలో సంతానలేమికీ పెద్దగా సంబంధం కనిపించలేదు.

 

గర్భవతులుగా ఉన్నప్పుడు!

స్త్రీలు పేరాసెటమాల్ తీసుకోవడానికీ, వారిలో సంతానం కలగడానికీ పెద్దగా సంబంధం బయటపడకపోవచ్చు. కానీ అంతకంటే విషాదకరమైన ఫలితాన్ని మరో పరిశోధన వెలువరుస్తోంది. గర్భవతులు తరచూ పేరాసెటమాల్‌ను తీసుకోవడానికీ, వారి పిల్లల్లో మానసికమైన సమస్యలు ఏర్పడటానికి మధ్య కొంత సమన్వయం ఉందని ఈ పరిశోధన తేలుస్తోంది. ఇందుకోసం స్పెయిన్‌లో కొన్ని ఆరోగ్య సంస్థలు కలిసి దాదాపు 2,500 మంది స్త్రీలను పరిశీలించారు. వారు గర్భం దాల్చిన దగ్గర్నుంచీ 32 వారాలపాటు వారి అలవాట్లను నిశితంగా పరిశీలించారు. వారికి పుట్టిన పిల్లలను ఐదేళ్లు వచ్చేవరకూ గమనించారు. ఇంత పరిశోధించిన తరువాత తేలిందేమంటే పేరసెటమాల్‌ మాత్రను ఒక్కసారైనా తీసుకునే గర్భవతులకు పుట్టిన పిల్లల్లో.... హైపర్‌ యాక్టివిటీ, ఆటిజం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. పేరసెటమాల్ నొప్పిని తగ్గించేందుకు మెదడులోని న్యూరాన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి... బహుశా అది తల్లి గర్భాన ఎదుగుతున్న పసిమెదళ్ల మీద కూడా ప్రభావం చూపుతూ ఉండవచ్చన్నది పరిశోధకులు అభిప్రాయం.

 

పైన పేర్కొన్న రెండు పరిశోధనల ఫలితాలూ సామాన్యులను కొంత భయపెట్టడం సహజమే! అయితే ఈ పరిశోధనలని చాలామంది నిపుణులు అసంపూర్ణమైనవిగానే కొట్టిపారేస్తున్నారు. ఈ నివేదికలు పేర్కొన్న నిజానిజాలను ధృవీకరించేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా విచక్షణారహితంగా ఎలాంటి మందులనూ వాడకూడదన్న విషయం మాత్రం ఈ పరిశోధనలతో రుజువవుతోంది. తస్మాత్‌ జాగ్రత్త!

 

- నిర్జర.