శ్రీలంకలో మలేరియా మాయం... మరి మనమో!

 

మన పక్కనే ఒక బిందువులా కనిపించే ఓ చిన్న దేశం శ్రీలంక. నిన్నమొన్నటి వరకూ నిరంతర అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోయిన దేశం. ఇప్పుడిప్పుడే ఆక్కడ ప్రశాంతమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి ఓ దేశం ఊహించని అద్భుతాన్ని సాధించింది. మలేరియా రహిత దేశంగా సగర్వంగా నిలిచింది. పెద్దన్నలాంటి మన దేశానికి కూడా ఆదర్శంగా నిలిచింది. ఆ విజయగాధ...

 

అనుకూలమైన పరిస్థితులు

శ్రీలంకలో అడవుల శాతం ఎక్కువ. నీటి లభ్యతకీ కొదవేమీ లేదు. పైగా చుట్టూ సముద్రమే! దోమలకు ఇంతకంటే స్వర్గధామం ఏముంటుంది. ఇక శ్రీలంకలో గ్రామీణ ప్రాంతాలే అధికం కాబట్టి, ఏదన్నా వ్యాధి వస్తే దానికి చికిత్స తీసుకోవాలన్న అవగాహన కూడా తక్కవే! దాంతో ఒకప్పుడు లక్షలాది మలేరియా కేసులు నమోదయ్యేవి. వేలాదిమంది జనం పిట్టల్లా రాలిపోయేవారు.

 

యుద్ధం మొదలు

శ్రీలంక ప్రభుత్వం ఆది నుంచీ కూడా మలేరియా మీద ఉక్కుపాదం మోపుతూనే ఉంది. మలేరియా పరీక్ష కోసం చేసిన రక్తపరీక్షల ఫలితాలను 24 గంటలలోనే అందించడం, డీడీటీ వంటి రసాయనాలతో దోమల వ్యాప్తిని నిరోధించడం వంటి జాగ్రత్తలను పాటించేది. ఇక 1958 నాటికి మలేరియా మీద పూర్తిస్థాయి యుద్ధాన్నే ప్రకటించింది. ఇందుకోసం కొలంబియాలో ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. మలేరియాని అదుపుచేసేందుకు ఉపయోగించే డీడీటీ ప్రమాదకరం అని తేలిపోవడంతో సరికొత్త ప్రణాళికలతో తన యుద్ధాన్ని కొనసాగించింది.

 

ఇవీ చర్యలు

- మలేరియా గురించి, దాని నివారణ చికిత్సల గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహనను కలిగించడం.

- మలేరియా బారిన పడిన రోగులకు సత్వర చికిత్స అందించడం ద్వారా, వారి నుంచి ఆ రోగకారకాలు ఇతరులకు చేరకుండా చూసుకోవడం.

- వర్షపాతం, నీటిప్రవాహం వంటి సూచనల ఆధారంగా మలేరియా ప్రబలే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అక్కడకు తగిన వైద్య సిబ్బందిని పంపించడం.

- దేశంలో నమోదవుతున్న మలేరియా కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఎక్కడ ఆ వ్యాధి ప్రబలుతోందో గమనించడం. భవిష్యత్తులో ఆ ప్రాంతాల మీద మరింత దృష్టిని సారించడం.

- ఒకపక్క మలేరియాని నివారించడం కోసం తగినన్ని నిధులను కేటాయిస్తూనే, మరో పక్క ఆ వ్యాధి మీద మరింత పట్టుని సాధించేందుకు పరిశోధనలు సాగించడం.

... ఇలా రకరకాలా చర్యలతో గత మూడు సంవత్సరాలుగా దేశీయంగా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఐక్యరాజ్యసమితి శ్రీలంకను మలేరియారహిత దేశంగా ప్రకటించింది.

 

మరి మనమో!

మన దేశంలో మలేరియా అంటే సర్వసాధారణమైన విషయం. ఏటా దాదాపు పదిలక్షలమందికి పైగా జనం ఇక్కడ మలేరియా బారిన పడుతూ ఉంటారు. ఇక ఓ వెయ్యమంది వరకూ ఈ వ్యాధితో మృత్యుఒడిని చేరుతూ ఉంటారు. శ్రీలంకంతో పోల్చుకుంటే ఇక్కడ జీవనవిధానాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాల దగ్గర నిధులకి కానీ, జనాల దగ్గర చదువుకి కానీ కొరత లేదు. కానీ లేనిదల్లా చిత్తశుద్ధి మాత్రమే! ఈ ఏడాది మన దేశం కూడా మలేరియాను 2030నాటికి సమూలంగా నాశనం చేస్తామని ప్రతిన పూనింది. అంటే మరో పదిహేను సంవత్సరాలకు కానీ మనం మలేరియా రహిత భారతదేశాన్ని చూడకపోవచ్చునన్నమాట! మన ఆరోగ్యశాఖల తీరుని గమనిస్తే అప్పటికైనా ఇది సాధ్యమేనా అన్న అనుమానమూ కలగక మానదు.

 

- నిర్జర.