జ్వరం ఇక దూరం

 

జరుగుబాటు ఉంటే జ్వరమంత సుఖం లేదంటారు పెద్దలు. కానీ ఎంత జరుగుబాటు ఉంటే మాత్రం మంచంలో అలా నిస్సహాయంగా పడి ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. జ్వరంతో పాటుగా వచ్చే సలపరింత, ఒళ్లునొప్పులు వంటి నానారకాల చిరాకులని ఎవరు మాత్రం ఇష్టపడతారు. అందుకనే జ్వరమొస్తే దాన్ని ఎలా తగ్గించుకోవలన్న తపనే అందరిదీనూ. అందుకోసమే ఈ వివరణ!

 

వైరల్‌ ఫీవర్లు!

మనకు వచ్చే జ్వరాలలో రెండు మూడు రోజుల పాటు సతాయించి విడిచిపెట్టే వైరల్‌ ఫీవర్లే ఎక్కువ. అందుకని ఆరోగ్యంగా ఉండే పెద్దలు ఒకటి రెండు రోజుల పాటు ఉండే జ్వరాల గురించి అంతగా కంగారుపడాల్సిన అవసరం లేదు. ఈ కింది సందర్భాలలో మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది...

 

- శరీర ఉష్ణోగ్రత 103ని తాకుతున్నప్పుడు. పసిపిల్లలలో అయితే ఈ ఉష్ణోగ్రత 100.4 దాటినా కూడా వైద్యుని సంప్రదించడం మేలు.

 

- రెండు రోజులకి మించి జ్వరం కనిపిస్తున్నప్పుడు.

 

- దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, నీరసం, కళ్లుతిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అతిగా దాహం వేయడం... వంటి ఇతర లక్షణాలు కనిపించినప్పుడు.

 

- బ్రాంకైటిస్, బీపీ, క్యాన్సర్‌ వంటి వ్యాధులు ఉన్నప్పుడు.

 

చిట్కాలు

చిన్నపాటి వైరల్‌ జ్వరాలలో ఉపశమనానికి ఈ కింద చిట్కాలను పాటించి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చు

 

- జ్వరంతో శరీరంలోని నీటి శాతం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల మూత్రం కూడా పచ్చగా మారడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఒళ్లు వేడిగా ఉన్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం మంచిది. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, జ్వరంగా ఉన్న రోజుల్లో కనీసం 8- 12 గ్లాసుల నీటిని తీసుకోమని చెబుతున్నారు. వైద్యులు. దీనివల్ల ఒంట్లో నీటి శాతం పెరగడమే కాకుండా, ఉష్ణోగ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

 

- గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల ఉష్ణోగ్రత నిదానంగా తగ్గడమే కాకుండా, శరీరంలో ఉన్న అలసట కూడా తీరుతుంది. అలాగని చన్నీటి స్నానం చేస్తే మాత్రం, శరీరంలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

 

- చల్లని నీటిలో తడిపిన గుడ్డతో నుదురు, మణికట్టు, మెడ, పాదాలని తుడుస్తూ ఉంచడాన్ని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఒకేసారి అన్ని ప్రాంతాలలోనూ తుడిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోవచ్చు. కాబట్టి ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో తుడిస్తే సరిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే సాక్సుని తడిపి రాత్రంతా ఉంచుకునే చిట్కాని వాడతారు, కానీ మన వాతావరణానికి అది సరిపోకపోవచ్చు.

 

- ఒకప్పుడు జ్వరం వస్తే లంఖణాన్నే (ఉపవాసం) మందుగా భావించేవారు. జ్వరాన్ని నయం చేసుకునేందుకు శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడమే ఉపవాసంలో ఉన్న లక్షణం. ఇప్పుటి ఉరుకులపరుగుల జీవితంలో ఉపవాసాలు కుదరకపోయినప్పటికీ.... తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వీటికి తోడుగా సీ విటమిన్‌, నీటి శాతం ఎక్కువగా ఉండే నారింజ వంటి పండ్లని కూడా తీసుకోవాలి.

 

- మన ఇంట్లోనే దొరికే తులసి, అల్లం వంటి ఔషధులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కూడా మంచి ఫలితం దక్కుతుంది.

 

 

- నిర్జర.