చమురు కంపెనీల న్యూ ఇయర్ గిఫ్ట్.. సామాన్యుడిపై ఇక వారానికోసారి బాదుడు
posted on Dec 24, 2020 @ 1:41PM
ఒకపక్క కరోనాతోను.. మరోపక్క ప్రతి రోజు పెరిగే పెట్రోల్ డీజిల్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు చమురు కంపెనీలు న్యూ ఇయర్ సందర్భంగా మరో కొత్త షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. మరికొద్ది రోజులలో రానున్న కొత్త సంవత్సరంలో ఇక వంట గ్యాస్ ద్వారా వడ్డనకు రెడీ అయ్యాయి. ప్రస్తుతం నెలకోసారి సిలిండర్ ధరలను సవరిస్తూ వస్తున్న కంపెనీలు.. ఇక వచ్చే ఏడాది నుంచి ప్రతి వారం ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరించాలని నిర్ణయించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతి రోజూ ధరలు మారుతుండడంతో తాము మాత్రం నెల మొత్తం నష్టపోతున్నామని చమురు కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ప్రతి వారం రోజులకు ఓసారి ధరలు సవరించి తమ నష్టాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. వాస్తవానికి ఈ నెలలో ఇప్పటికే గ్యాస్ బండపై బాదుడు మొదలైంది. ఈ నెలలోనే రెండుసార్లు ధరలు భారీగా పెంచారు మొన్న డిసెంబర్ 2న సబ్సిడీ సిలిండర్ ధర రూ.50 పెరగగా.. డిసెంబర్ 15న మళ్ళీ రూ.50 పెరిగింది. ఇక చమురు కంపెనీల తాజా నిర్ణయం ప్రకారం.. ఇప్పుడు వారానికోసారి ధరలను సవరిస్తే.. ఏడాది తిరిగిలోపే సిలిండర్ ధర భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.