జేసీ ఇంటిపై వైసీపీ రాళ్ల దాడి! తాడిపత్రిలో హై టెన్షన్
posted on Dec 24, 2020 @ 1:48PM
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి వీరంగం వేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు..అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు. అయితే దాడి జరిగిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరు. దీంతో అక్కడన్న దాసరి కిరణ్ అనే యువకుడిని కేతిరెడ్డి అనుచరులు చితకబాదారు. రెండు రోజుల్లో తాడిపత్రి విడచి వెళ్లకపోతే చంపుతామంటూ బెదిరించారు. తనపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వార్తలు వస్తున్న నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
తన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. పోలీసులు కూడా జేసీ ఇంటికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో స్థానికులు హడలి పోతున్నారు.