మళ్ళీ మళ్ళీ అదే తప్పు.. మహమ్మారి నుండి ప్రజలను కాపాడేది ఇలాగేనా
posted on Dec 24, 2020 @ 12:14PM
బిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడడంతో ప్రపంచం మొత్తం అప్రమత్తమై బ్రిటన్ తో విమానాల రాకపోకలను అనేక దేశాలు రద్దు చేసుకున్నాయి. అయితే కొంత ఆలస్యంగానైనా భారత్ కూడా బ్రిటన్ తో విమాన రాకపోకలను నిలిపివేసింది. అంతేకాకుండా బిటన్ నుండి వస్తున్న విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే ఆర్టీపిసిఆర్ టెస్టులు చేసి వారిని క్వారంటైన్ లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇక్కడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి మొన్న మార్చిలో చేసిన పొరపాట్లని మళ్ళీ రిపీట్ చేస్తున్నట్లుగా తాజా ఘటనలను పరిశీలిస్తే అర్ధమవుతోంది. ఈ ఏడాది మార్చిలో కరోనా వ్యాపిస్తున్న మొదట్లో విదేశాల నుండి వచ్చే వారిని పరీక్షలు చేసి తప్పనిసరి క్వారంటైన్ కు తరలించకపోవడంతో దేశం మొత్తం ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు మనమందరం అనుభవిస్తూనే ఉన్నాం.
తాజాగా బ్రిటన్ నుండి వచ్చిన వ్యక్తి ఒకరు ఢిల్లీ విమానాశ్రయంలో ఆర్టీపిసిఆర్ టెస్ట్ చేయించుకుని కనీసం రిజల్ట్ వచ్చేవరకు కూడా వెయిట్ చేయకుండా హడావిడిగా సొంత ప్రాంతానికి బయలుదేరడం ప్రభుత్వాల విధానంలోని డాల్ తనన్న్ని మరోసారి బయటపెడుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ మహిళ ఒకరు ఈనెల 22న బ్రిటన్ నుండి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆమె కుమారుడు కూడా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు.
అయితే ఆ మహిళా యూకేలో కరోనా పరీక్షలు చేయించుకున్నా.. అక్కడ ఫలితాలు రాకుండానే బయలుదేరి భారత్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇండియాలో కూడా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. అయితే ఇక్కడ కూడా టెస్ట్ రిజల్ట్ వచ్చేవరకు ఢిల్లీలో క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా, ఆమె అక్కడ నుండి కూడా పరారై రాజమహేంద్రవరం రావడానికి ఎపి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. అయితే ఆమెకు చేసిన టెస్టులో పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆమె గత అర్ధరాత్రి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది అని తెలుసుకుని రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులను, వైద్య విభాగం సిబ్బందిని అప్రమత్తం చేయడంతో రాజమహేంద్రవరం చేరుకున్న ఆమెను, కుమారుడితో సహా క్వారన్టైన్ కు తరలించారు.
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే.. కొత్త స్ట్రెయిన్ వైరస్ వ్యాపిస్తున్న బ్రిటన్ నుండి వచ్చిన ఆమెను కనీసం టెస్ట్ రిజల్ట్ వచ్చేవరకు ఢిల్లీ దాటకుండా కట్టడి చేయలేకపోవడం పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యంగానే భావించాలి. ఆమెకు సోకింది పాత తరం వైరస్ ఐతే కొంత మెరుగు.. కానీ అదే కొత్త తరం వైరస్ అయితే.. ఆ మహిళా ఏకంగా రైలులో ఢిల్లీ నుండి రాజమహేంద్రవరం వరకు ప్రయాణం చేయడంతో దారిలో ఈ వైరస్ ఎంత మందికి సోకి ఉంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గత మార్చిలో కేవలం ఇద్దరి నిర్లక్ష్యం వలన ఏకంగా విజయవాడ నగరంలో కరోనా దావానలంలా వ్యాపించిన సంగతి తెల్సిందే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా ఉన్న భారత్ లో.. రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేదలు ఉన్న ఈ దేశంలో.. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.