Read more!

తూచ్! అవి తెదేపా గురించి కాదు: లోకేష్

 

చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ వీలయినంత త్వరగా రాజకీయాలలో తన ఉనికిని చాటుకోవాలని, పార్టీలో ప్రధాన పాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతున్నసంగతి అందరికీ తెలిసిందే. తన రాజకీయ ఆరంగ్రేటం స్వస్థలం చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో మొదలుపెట్టడమే ‘తనకు అన్నివిధాల ఆరోగ్యకరం’ అనే ఆలోచనతో కుప్పం నియోజక వర్గంలో గత రెండు రోజులుగా ‘పల్లెపల్లెకు తెలుగుదేశం’ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని, చిన్న చిన్న ప్రసంగాలు చేస్తూ తన ‘రాజకీయ ఎప్రంటిస్’ మొదలుపెట్టారు కూడా. కానయితే, శిక్షణ ఇచ్చేందుకు పక్కన గురువు లేకపోవడం, అనుభవ రాహిత్యం వల్ల లోకేష్ చాలాసార్లు తడబడుతున్నారని సమాచారం.

 

లోకేష్ ముందే ప్రకటించినట్లు, తన తండ్రి పాదయాత్ర ముగించుకొని ఇంటికి వచ్చేవరకు కొంచెం ఓపికపట్టి ఉంటే, చంద్రబాబు ఆయనకి రక్షగా తన అతిరధ మహారధులను తప్పక పంపేవారు. కానీ, యువకుడయిన లోకేష్ అంతకాలం ఒపిక లేనట్లు నేరుగా కార్యక్షేత్రంలో దూకేయడంతో ఆయన యాత్రలో పదనిసలు మొదలయ్యాయి.

 

మొన్నజరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో, వారిని తమ పార్టీకే ఓటేయమని కోరడంతో నవ్వులు విరబూయించిన ఆయన, ఈ రోజు చిత్తూరు జిల్లా వి.కోటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అలవాటులో పొరబాటుగా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకి అన్వయించవలసిన లక్షణాలన్నిటినీ స్వయంగా తమ పార్టీకే అన్వయిస్తూ “'అవినీతి, బంధుప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనావుందంటే అది తెలుగుదేశం పార్టీ. అవునా, కాదా?” అంటూ కార్యకర్తలను అడిగారు. ఆయన మాటలకు షాకయిన కార్యకర్తలు గట్టిగా కేకలు వేయడంతో ‘లోకేష్ సర్దుకొని మళ్ళీ రెండు కాంగ్రెస్ పార్టీలకు ఆ అవలక్షణాలు బదలాయించేసి, తెదేపాను, తన తండ్రి చంద్రబాబును పొగుడుతూ ఉపన్యాసం ముగించారు.

 

ఇటువంటి సువర్ణావకాశం కొరకే ఓపికగా ఎదురుచూస్తున్న సాక్షి మీడియా ఆయన మాటలను వెంటనే ప్రచురించేసింది కూడా. రేపు, ఆయన మాటలను పట్టుకొని రెండు కాంగ్రెస్ పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీతో ఆడుకోక వదిలిపెట్టరు కదా!