క్లారిటీ లేని పొత్తులా? ప్రత్యర్థులని ముప్పుతిప్పలు పెట్టడమా?
posted on Jun 20, 2023 @ 3:09PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ది క్లారిటీ లేని రాజకీయమా?, క్లారిటీ లేకనే ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారా?, ఆ క్లారిటీ లేకనే మొన్నటి వరకు సీఎం అయ్యేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా? అంటే ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అవుననే అంటారు. మరి నిజంగానే ఆయన క్లారిటీ లేకనే ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా? అంటే ముమ్మాటికీ కాదని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పవన్ ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు మొదలు పెట్టారు. అందుకు తగ్గట్లే ఒక్కోసారి ఒక్కోలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇది అర్ధం చేసుకోవాలంటే కాస్త లోతుగా వెళ్లి విశ్లేషణ చేసుకోవాలి.
పవన్ జనసేన పార్టీ పెట్టిన తొలిసారి ఎన్నికలలో ఆయన పోటీ చేయనే లేదు. టీడీపీ-బీజేపీ కూటమికి సహకరించి వారి విజయానికి అంతో ఇంతో సహకరించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత 2019 ఎన్నికలలో ఆయన సింగిల్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఓటమి మాత్రమే కాదు.. రాజకీయంగా ఆయన లెక్కలు కూడా తప్పేనని ఈ ఎన్నికలలో తెలిసొచ్చింది. దీంతో దీర్ఘకాలిక రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన పవన్ జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకి సిద్దమై.. 1+1=2 ఫార్ములాతో బలం పెంచుకున్నారు. ఇక ఎన్నికలకు రెండేళ్ల ముందు నుండే ఈ సారి తప్పు చేయబోనని, వైసీపీకి అధికార దక్కనివ్వమని, అందుకోసం తాను ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు.
అయితే, ప్రస్తుతం తన వారాహీ వాహనంతో పర్యటన సాగిస్తున్న పవన్ కాకినాడలో మాట్లాడుతూ.. మీరు ఆశీర్వదిస్తే సీఎం అవుతానని.. మీరు కోరుకుంటే తానే సీఎం అభ్యర్థిని అవుతా అంటూ మాట్లాడారు. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి సోషల్ మీడియా వరకూ ఎవరికి వారు పొత్తుపై పవన్ పునరాలోచన చేస్తున్నారని, పొత్తు వ్యవహారం చెడిందని విశ్లేషణలు మొదలు పెట్టారు. కానీ, ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది.. పవన్ మాటలకు అర్ధాలే వేరులే అని. ఆ అర్ధం ఏంటో కాదు.. టీడీపీతో కలిసి నడిచేది గ్యారంటీ అని ఎప్పుడో విడమర్చి చెప్పేశారు. కానీ, లెక్కలు.. సీట్లు.. పదవుల బేరం ఇంకా ఏదీ తేలలేదు. అవి తేల్చాల్సిన సమయం దగ్గర పడుతుంది. అందుకే పవన్ మార్క్ స్ట్రాటజీగా దీన్ని చూడాలి.
ఎవరు ఎన్ని అనుకున్నా.. రాజకీయం రాజకీయమే కదా. ఎంత పొత్తు అయినా.. నాలుగు సీట్లు ఎక్కువగా దక్కించుకోవాలనుకోవడం రాజకీయ పార్టీ ధర్మం. అదే ఇప్పుడు పవన్ చేస్తున్నది. దీనికి తోడు జనసైనికులు పవన్ కళ్యాణ్ ను ఎప్పుడూ రాజకీయ నేతగా చూడరు. వెండితెర మీద ఆయన్ని హీరోగా చూసిన అభిమానులు రాజకీయాలలో కూడా ఆయన్ను హీరోగా (సీఎం) చూడాలని ఆశపడుతుంటారు. ఒక్కో సందర్భంలో అభిమానుల నినాదాలు శృతి మించిన సమయంలో పవన్ కూడా తనకి కూడా సీఎం కావాలనే ఉందంటూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. అలా తానే సీఎం అనే టాక్ ఎంత పబ్లిక్ లోకి వెళ్తే రేపు పొత్తులలో జనసేనకి అంత డిమాండ్ పెరుగుతుంది. ఆ కారణంగానే పవన్ ఇప్పుడు సీఎం నినాదాన్ని ఎత్తుకున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.
పైగా, ఈ మధ్య కాలంలో అధికార వైసీపీ టీడీపీ, జనసేనలను కలిపే మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలిపై విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలు, టీడీపీని గెలిపించేందుకు మాత్రమే పవన్ రాజకీయం పరిమితమైందని విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కనుక ఈలోగా ఇలా తానే సీఎం అనే మాట ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు బ్రేక్ వేసినట్లౌతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకే పవన్ అప్పుడప్పుడూ ఇలా ప్రత్యర్థులకు నోటి నిండా మాట్లాడుకోవడానికి స్టఫ్ ఇస్తుంటారు. దాన్నే నమ్ముకొని ప్రత్యర్ధులు పండగ చేసుకుంటుంటారు. కానీ, నిజానికి పవన్ టార్గెట్ 2029 మాత్రమే. ఇప్పటికే వేలసార్లు ఈ మాట చెప్పినా.. అప్పుడప్పుడు ఇలా చిన్నా చితకా ప్రచారాలకు విపక్షాలు పండగ చేసుకోవడమే ఆసక్తి కలిగించే అంశం.