వైసీపీలో బొత్స సీన్ అయిపోయిందా?.. ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ముందరికాళ్ల బంధమేనా?
posted on Jan 9, 2024 @ 10:50AM
వైసీపీలో బొత్స సీన్ అయిపోయిందా? చీపురుపల్లి నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆయన చాన్స్ లేదా? జగన్ ఆయనను పక్కన పెట్టేశారా? ఓపిక ఉంటే పార్టీ వ్యవహారాలు చూడండి.. లేకుంటే విశ్రాంతి తీసుకోండి అని అన్యాపదేశంగా చెప్పేస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అసలు వైసీపీలో పక్కన పెట్టేయడానికీ, వాడుకుని విసిరేయడానికీ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదు. అయినా బొత్స విషయంలో ఏదో మేరకు మినహాయింపు ఉంటుందని అంతా భావించారు. మరీ ముఖ్యంగా బొత్స సత్యానారాయణలో ఆ విశ్వాసం మిక్కుటంగానే ఉంది. కాదు కాదు ఉండేది.
అయితే ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకూ విషయం చూచాయిగా బోధపడినట్లుంది. అయినా ఏదో ఆశతో ఆయన పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగానే పాల్గొంటున్నారు. తన నైజానికి విరుద్ధంగా సమ్మెలు చేస్తున్న ఉద్యోగులు, అంగన్ వాడీల విషయంలో ఒకింత పరుషంగానూ మాట్లాడుతున్నారు. అంతే కాదు.. పార్టికి సంబంధించి ఇబ్బందికరమైన ప్రతి అంశంలోనూ, సందర్భంలోనూ బొత్సనే ముందు పెట్టి వ్యవహారం నడిపించేస్తున్నారు జగన్. అదే సమయంలో పార్టీ వర్గాల ద్వారానే చీపురుపల్లి టెక్కెట్ బొత్సకు హుళక్కే అంటూ లీకులు ఇప్పిస్తున్నారు. బొత్స మనస్తాపానికి గురైనా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. షర్మిల ఎంట్రీతో గోడ దూకేయకుండా బొత్స భార్యకు విశాఖ ఎంపీ టికెట్ ఆఫర్ చేసి కట్టిపారేయాలని చూస్తున్నారు జగన్.
బొత్సకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, ఆయన పక్క చూపులు చూసే అవకాశం లేకుండా చక్రబంధంలో బిగించేయడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఎందుకంటే విజయనగరం జిల్లాపై బొత్సకు ఉన్న పట్టు అలాంటిది. జగన్ తండ్రి వైఎస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బొత్స రాజకీయంగా ఓ వెలుగు వెలిగారు. జిల్లాపై గట్టి పట్టు సాధించారు.
అందుకే 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ కంటే చంద్రబాబు అయితేనే బెటర్ అన్నది తన ఉద్దేశమని కుండబద్దలు కొట్టినట్లు బొత్స సత్యనారాయణ మీడియా ముఖంగా చెప్పినా, జగన్ బొత్సను పార్టీలోకి తీసుకున్నారు. మంత్రి పదవి ఇచ్చారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బొత్సను జగన్ పక్కన పెట్టేస్తారని అప్పట్లో గట్టిగా వినిపించినా, జగన్ కూడా పక్కన పెట్టేయాలని అనుకున్నా.. ఆ పని చేయలేకపోయారు. ఎందుకంటే రాజకీయంగా బొత్సకు ఉన్న పట్టు అలాంటిది మరి. ఇక బొత్స సతీమణి ఝాన్సీకి విజయనగరం నుంచి కాకుండా విశాఖ నుంచి ఎంపీ టికెట్ ఆఫరేంటి అన్న ప్రశ్నకు కూడా పార్టీ వర్గాల నుంచే సమాధానం వస్తోంది. బొత్సకు హ్యాండిచ్చి.. ఆ కుటుంబానికి ఓ ఎంపీ టికెట్ ఇచ్చేసి చేతులు దులుపుకోవడం ద్వారా పార్టీలో, పాలిటిక్స్ లో బొత్సను జీరో చేయడమే జగన్ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇందుకు కారణాలు కూడా వారే చెబుతున్నారు. జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా జగన్ పై బొత్స తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారనీ, అదే సమయంలో తనకు ఇచ్చిన పోర్టుపొలియోపై తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
ఇక ఇప్పుడు తాజాగా ప్రజలలో వైసీపీ పట్ల వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను గుమనించి ఇటు తెలుగుదేశం, అటు షర్మిల ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆ పార్టీలోకో జంపయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో బొత్సను గోడదూకకుండా నిరోధించే వ్యూహంలో భాగమే బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఆఫర్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.