లాలీ వీరమరణం!
posted on Jul 23, 2022 @ 1:25PM
ఉత్తరప్రదేశ్ ఫతాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూల్ గ్రామంలో ఇటీవల చాలామంది ఒక పెద్దాయన ఇంటి వద్ద ఆమధ్య గుమిగూడి సంతాపం ప్రకటించి దహనసంస్కారాలు చేసేరు. ఎంతయినా లాలీ.. లాలీయే..నాలుగు రోజులుముందు పుట్టిన లేగ దూడను కాపాడి తన ప్రాణాలు కోల్పోయింది.. అది స్వామిభక్తంటే.. అనుకున్నారంతా! లాలీ వీరమరణం పొందింది. ఇంతకీ ఈ లాలీ ఎవరంటే ఓ కోడి.
తినడానికి ఎన్నిఉన్నా, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది. కానీ తొంభైశాతం మంది భోజనప్రియులకు చికెన్ అంటేనే ప్రాణం. కోడియన్నది తినుటకేగదా మానవా! అనే డైలాగులు నిత్యం హోటళ్లలో వింటూండవచ్చు. కానీ బహదూల్ వాసులు మాత్రం లాలీని బ్రహ్మాండంగా పెంచేరు, తమ ఇంట్లో ఆవులు, గేదెల్లాగా ఎంతో ప్రేమతో. అందుకే వారికోసం ప్రాణ త్యాగం చేసింది.
డాక్టర్ సక్రామ్ సరోజ్ ఇంటి ఆవరణలో ఆ మధ్య లేగ పుట్టింది. దానికి రక్షగా ఇంటిల్లాపాదీ జాగ్రత్తగా చూసుకోవడానికి పగలూ రాత్రి కాపలా కాస్తుండేవారు.
ఒక రోజు ఎవ్వరూ లేని మధ్యాన్నం సమయంలో ఒక కుక్క ఆ ఆవరణలోకి వచ్చి ఆ లేగ మీద దాడి చేసింది. అక్కడికి కొద్ది దూరంలో లాలీ అనే వారి కోడి అలా తిరుగుతూ కుక్కని చూసి పరుగున వచ్చి కుక్కను ఎదిరిం చింది. కుక్క ఓ క్షణం ఆశ్చర్య పోయింది.. నువ్వెంత.. నేనెంత అన్నట్టు చూసింది. కోడి ఎగిరి దాని మొహాన్ని పొడిచింది. కుక్క కాలితో ఒక్క తన్ను తన్నది అది అవతలపడింది. ఇక లేవదని మళ్లీ లేగ దగ్గరికి వెళ్లింది. లాలీ శక్తినంతా కూడగట్టుకుని వచ్చి మళ్లీ కుక్క కంటి మీదా, మొహం మీద దాడి చేసింది. ఎంతయినా కుక్క బలం ముందు కోడి ఆగగలదా? గట్టిగా ఒక్క తన్ను తన్నింది. లాలీ ఎగిరి చాలాదూరం పడి రక్తం ఓడి ప్రాణం విడిచింది. కానీ దాని దాడికి కాస్తంత దెబ్బలు తిన్న కుక్క మళ్లీ వస్తుందేమోనని యజమాని చూసి చంపుతాడన్న భయంతో పారిపోయింది.
కొంతసేపటికి ఆ ఇంటివారు లాలీ దూరంగా రక్తం మడుగులో పడి ఉండడం చూసి ఎంతో బాధపడ్డారు. సరోజ్ కుమారుడు అభి షేక్ ఆ కుక్క కోసం వీధంతా వెతికాడు. అది ఎటో పారిపోయింది. అతగాడు ఏడుస్తూ ఇల్లు చేరాడు. కానీ అప్పటికి జరగాల్సింది జరిగిపోయింది. ఇంటిల్లపాదీ, పక్కనున్న వాళ్లూ అంతా లాలీ సాహసానికి ఎంతో మెచ్చుకున్నారు, చనిపోయిందని చాలా బాధ పడ్డారు. దాన్ని అక్కడే సరోజ ఇంటి ఆవరణలోనే ఖననం చేశారు. చాలా కాలం క్రితం లాలీని ఆశా దేవీ అనే కూరలు అమ్ముకునే మహిళ దగ్గర నుంచి డాక్టర్ సరోజ తెచ్చుకున్నారు.