ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. పత్తా లేని మంత్రులు
posted on Jul 23, 2022 @ 1:54PM
గోదావరి వరద చరిత్రను తిరగ రాసింది. 36 ఏళ్ల తర్వాత గోదారమ్మ మరోసారి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వచ్చిపడుతున్న వరదనీటి ప్రవాహానికి నదీ పరీవాహక ప్రాంతాలు తల్లడిల్లిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వందలాది లంక గ్రామాల ప్రజలు వరదనీటి మునకలో నరకయాతనలు పడుతున్నారు. అనేక లంక గ్రామాల్లో వరదనీరు 18 నుంచి 25 అడుగుల ఎత్తులో ప్రవహించింది. కొన్ని మండలాల్లో ఏ లంక గ్రామం ఎక్కడ ఉందో తెలియనంతగా వరదనీరు వెల్లువెత్తింది. గోదావరినదీ పాయలు వశిష్ట, వైనతేయి, గౌతమి భీకరరూపం దాల్చి ప్రవహించాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని పలు గ్రామాలు కూడా వరద ఉధృతితో అల్లాడిపోయాయి.
ప్రకృతి విపత్తు ఊళ్లకు ఊళ్లపైన ఇంతలా విరుచుకుపడినా ఏపీలోని ఏ మంత్రి కూడా వరద బాధిత ప్రాంతాలను కన్నెత్తి చూడడం లేదని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసి అధికారం కట్టబెట్టిన తాము అసలు బతికి ఉన్నామో చచ్చామో కూడా చూసేందుకు కూడా ఒక్క మంత్రి కూడా రాలేదని దుయ్యబడుతున్నారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక, పిల్లలకు పాలు లేక, కొంపా గోడు కూలిపోయి, ఇంట్లోని సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయి, పాడైపోయినా తమను ఏ ఒక్క మంత్రీ కనీసం పలకరించకపోవడం, పరామర్శించకపోవడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఏలూరు జిల్లాలో ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద బీభత్సంతో 50 వేల మందికి పైగా ప్రజలు అల్లాడిపోయారు. అయినప్పటికీ వారిని పరామర్శించేందుకు కనీసం ఒక్క వైసీపీ నేత గాని, ఒక్క మంత్రి గానీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక పక్కన ఎక్కడికక్కడ టీడీపీ స్థానిక నేతలు తమకు తోచిన మేరకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఆహారం, తాగునీరు లాంటివి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గుండెలోతు వరదనీటిలో కూడా స్వయంగా తమ వద్దకే వచ్చి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సహాయ సహకారాలు అందించారు. అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రుల కానీ ఒక్కరు కూడా తమను పట్టించుకున్న పాపాన పోలేదని శాపనార్థాలు పెడుతున్నారు.
సీఎం జగన్ రెడ్డి కూడా ఏదో గాల్లో వచ్చి గాల్లోనే తిరిగి.. తమను గాలికి వదిలేసి తుర్రుమన్నారే తప్ప నేరుగా తమ ఇబ్బందుల గురించి ఒక్క మాట అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరద బీభత్సంలో కూడా మరో పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి తమను పరామర్శించి, కష్టసుఖాలు తెలుసుకోవడం పట్ల వరద పీడిత ప్రాతాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతిలో పడవ ప్రమాదం జరిగి, టీడీపీ సీనియర్ నేతలు నదిలో పడిపోయారు. అయితే.. అప్పటికే చంద్రబాబు మరో బోటులోకి వెళ్లడంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇలా ప్రాణాలకు తెగించి కూడా టీడీపీ అధినేత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు తమకు అండగా నిలబడితే.. వైసీపీ నేతలకు ఏ మాయ ముంచుకొచ్చిందని దుయ్యబడుతున్నారు. అయితే.. తూర్పు గోదావరి జిల్లాలో కొందరు మంత్రులు వరద ప్రాంతాలకు వచ్చి, చూసి వెళ్లారంటే.. కనీస సాయం అందించలేదని, మాట వరసకు కూడా ఒక్క హామీ ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక పక్కన చంద్రబాబు సహా టీడీపీ నేతలు వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, భరోసాగా నిలిస్తే.. ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందం’గా సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకోవడాన్ని జనం తప్పుపడుతున్నారు. జగన్ ఎంతసేపూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అడ్డదారుల్లో అయినా మళ్లీ ఎలా అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయమే తప్ప తమను పట్టించుకోవడంలేదని ఫైరవుతున్నారు. ఒక పక్కన లక్షలాది మంది జనం వరద ముంపులో నానా అగచాట్లు పడుతుంటే.. జగన్ మాత్రం జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాలు, నియోజకవర్గం, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీల గురించి చర్చలతో కాలక్షేపం చేయడమేంటని నిలదీస్తున్నారు.