ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? విపక్షాలపై కేటీఆర్ ఫైర్
posted on Mar 12, 2021 @ 2:52PM
ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారు? మొదట భారతీయులం, తర్వాతే తెలంగాణ బిడ్డలం. ఇదీ కేటీఆర్ ఆగ్రహం. విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దతు ప్రకటించాక ఆయనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కుకు మద్దతు ఇచ్చారని ఆరోపించాయి. కేటీఆర్ స్టేట్‌మెంట్ దురుద్దేశపూర్వకంగా ఉందంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడితే.. ముందు తెలంగాణలో మూతపడిన ప్రాజెక్టులపై పోరాడమంటూ బీజేపీ నేతలు నిలదీశారు.
తన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ కొనసాగుతుండటంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. నీవెవరు అడిగేందుకు? ఏపీతో నీకేం పని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? మేం మాట్లాడకూడదా? 80వేల మంది బీఎస్‌ఎన్ఎల్ ఉద్యోగులను రోడ్డుపై పడేసింది. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా?ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడతారు. ఏపీకి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సంబంధం అని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారు? ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదు. మొదట భారతీయులం.. తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఖండించాలంటూ విపక్షాలపై కస్సుమన్నారు కేటీఆర్.