అవి'నీతి' బండి! 600కోట్లు.. ఏది నిజం? ఏది ప్రచారం?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి 600 కోట్ల ఆస్తులు. ఢిల్లీ కంపెనీలో 50 కోట్ల పెట్టుబడులు, కరీంనగర్ జిల్లా తీగలగుట్ట దగ్గర 3 కోట్ల పంటభూమి. రాజేంద్రనగర్‌లో బినామీ పేరిట 75 కోట్ల విలువైన భూములు. ఇలా సోషల్ మీడియాలో విస్త‌ృత ప్రచారం. ఇవి చాలవన్నట్టు.. తాజాగా ఓ గ్రానైట్ స్కాంలోనూ బండి సంజయ్ పేరంటూ మరో వీడియో. బండి సంజయ్ ఆస్తుల పేరుతో ఓ పేపర్ క్లిప్పింగ్, గ్రానైట్ దందా అంటూ ఓ వీడియో. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ రెండూ ఫేక్ అని తెలుస్తోంది. 

బండి సంజయ్‌పై ఆరోపణలకంటే ఈ సమయం, సందర్భమే మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతోంది. ఆయన నాయకత్వంలో దుబ్బాకలో దుమ్ము లేపింది కమలం పార్టీ. గ్రేటర్‌లోనూ గులాబీ పార్టీకి చుక్కలు చూపించింది. ఇక నాగార్జున సాగర్ బై పోల్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌ల్లోనూ సత్తా చాటేందుకు సై అంటోంది. ఇక, అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలకూ సమయం దగ్గర పడింది. పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా.. ఈ రెండు స్థానాల్లో గెలుపు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని అమాంతం మార్చేయగలవు. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి 600 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడం, గ్రానైట్ బ్లాక్‌మెయిల్ దందాలో ఆయన పేరు వినిపించడం.. రాజకీయంగా సంచలనంగా మారింది. 

కరీంనగర్‌ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు బండి సంజయ్. రెండేళ్లకు ముందు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఆయనకు పెద్దగా ఆస్తులేమీ లేవు. అలాంటిది సడెన్‌గా.. 600 కోట్ల ఆస్తులంటూ ఆరోపణలు రావడం, గ్రానైట్ వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంపై పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. అయితే.. తనపై వచ్చిన ఆరోపణలపై బండి సంజయ్ ఇచ్చిన వివరణపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను 600 కోట్లు సంపాదించినట్టు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని.. నిరూపిస్తే నిరుద్యోగ భృతి తానే చెల్లిస్తానని బండి సంజయ్ అన్నారు. అంతే, ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో ఆ మేటర్‌ను అక్కడికి క్లోజ్ చేశారు. మళ్లీ 600కోట్ల గురించి పెద్దగా వివరణ ఇచ్చింది లేదు. మరోవైపు, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఇంత పెద్ద అవినీతి ఆరోపణ వస్తే.. బీజేపీ నేతలు సైతం పెద్దగా స్పందించలేదు. అంటే.. మౌనం అర్థ అంగీకరమేగా? అంటున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు.  

బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ. డబ్బు కంటే జెండా, ఎజెండానే వారికి ప్రాధాన్యం. అందుకే, బీజేపీ నేతలపై పెద్దగా అవినీతి ఆరోపణలు వినిపించవు. కానీ, ఇటీవల ఇటు ఏపీలో, అటు తెలంగాణలో పలువురు ప్రముఖ బీజేపీ నేతలకు అవినీతి మకిలీ అంటుకోవడం వివాదాస్పదమవుతోంది. ఓ ఆశ్రమం విషయంలో ఏపీ బీజేపీ నాయకులు జీవీఎల్, విష్ణువర్ధన్‌రెడ్డిలపై కూడా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. వరుస ఘటనలు మిస్టర్ క్లీన్ పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని అంటున్నారు. అయితే, అవినీతి ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా.. కనీసం ఆ ఆరోపణలను గట్టిగా ఖండించడమో, సరైన వివరణ ఇవ్వడమో కూడా చేయడం లేదు ఆయా నేతలు. తాజాగా, బండి సంజయ్‌పై వినిపిస్తున్న 600 కోట్ల ఆస్తులు, గ్రానైట్ వ్యాపారుల నుంచి పైసా వసూల్ వ్యవహారంపై బీజేపీ నేతలను వివరణ అడిగే ప్రయత్నం చేసింది తెలుగు వన్ న్యూస్. బీజేపీ నేతలెవరూ ఆ విషయంపై స్పందించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నామంటున్నారు బీజేపీ నేతలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమలనాథులపై వరుసగా వస్తున్న అవినీతి ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇస్తేనే.. అసలు నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలిసేది. లేదంటే, ఫేక్ న్యూసే నిజమనుకునే ప్రమాదం ఉంది. కాదంటారా..?