కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిఫెన్స్ లో పడేసిన రేవంత్
posted on Aug 6, 2022 7:02AM
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనపై ఏక కాలంలో విమర్శల దాడి చేయడాన్ని రేవంత్ తిప్పికొట్టిన తీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డినిక డిఫెన్స్ లో పడేసింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామాకు ఆయన ఒక్కో సారి ఒక్కో కారణం చెప్పినా చివరకు తేల్చిందేమిటంటే మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్న తమను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వక్తికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడమేమిటి? ఆ వ్యక్తి ఆదేశాల మేరకు మేం పని చేయడమిటన్న దుగ్ధే కారణమని. అదే రాజగోపాలరెడ్డి పార్టీ మారడానికి కారణమని రాజగోపాలరెడ్డి తేల్చేశారు.
తన తమ్ముడు పార్టీ మారడంతో తనకు సంబంధం లేదని ఒక వైపు చెబుతూనే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలాగే వెంకటరెడ్డి కూడా రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం. రేవంత్ వైఖరి, వ్యవహార శైలి వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే రాజగోపాలరెడ్డిపై రేవంత్ విమర్శలను తనకు ఆపాదించుకుని వెంటకరెడ్డి తన విమర్శలకు పదును పెట్టారని చెబుతున్నారు. మరో వైపు వెంకటరెడ్డి తమతో టచ్ లో ఉన్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ప్రకటించినా దానిని ఖండించకుడా వెంకటరెడ్డి రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం, వరద నష్టం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఇవన్నీ వెంకటరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే దిశగా అడుగుతు వేస్తున్నారనడానికి సంకేతాలేనని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి స్పందన వ్యూహాత్మకంగా ఉందని చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తాను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదనీ, తన విమర్శల దాడి అంతా పార్టీ మారిన కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డిపైనేనని రేవంత్ రెడ్డి విస్పష్టంగా చెప్పారు. పైగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వేరు.. వెంకటరెడ్డి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుడని చెప్పన రేవంత్ రెడ్డి రాజగోపాల రెడ్డిని మాత్రం కాంగ్రెస్ ద్రోహి అని పునరుద్ఘాటించడం ద్వారా వెంకటరెడ్డికి చెక్ పెట్టారు.రేవంత్ వివరణతో ఇక వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేసినా అవి బూమరాంగ్ అయ్యే పరిస్ధితి కల్పించారు. రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి.. తాను పార్టీకి దూరం కావడానికి ఆయనేనని చూపాలన్న వెంకటరెడ్డికి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే కాంగ్రెస్ లో క్షేత్ర స్థాయిలో పార్టీ సీనియర్ల తీరు పట్ల ఒకింత అసంతృప్తి ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోందనీ, తెరాసకు దీటుగా కాంగ్రెస్ నిలబడుతోందని క్షేత్ర స్థాయిలో బలపడిందని శ్రేణులు నమ్ముతున్నారు.
ఈ పరిస్థితుల్లో రేవంత్ విస్పష్ట వివరణ తరువాత కూడా కోమటి రెడ్డి తన విమర్శల దాడి కొనసాగిస్తే కార్యకర్తల దృష్టిలో పలుచన అయ్యే పరిస్థితి ఉంది. మొత్తం మీద కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీని వీడినా అందుకు కారణం రేవంత్ అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ ఆయన అలా చెప్పినా ఎవరూ నమ్మే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.