భారత రెజ్లర్ల పసిడి పతకాల పంట.. ఒకే రోజు మూడు స్వర్ణాలు
posted on Aug 6, 2022 7:42AM
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు సత్తా చాటారు ఒకే రోజు మూడు స్వర్ణాలను ఒడిసి పట్టారు. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, దీపక్ పూనియాలు స్వర్ణ పతకాలు సాధించారు.
దీంతో ఒకే రోజు మూడు స్వర్ణాలు భారత్ ఖాతాలోకి చేరాయి. దీంతో ఇప్పటి వరకూ ఈ కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణాల సంఖ్య 9కి చేరింది. మొత్తం పతకాల సంఖ్య పాతికకు చేరంది. ముందుగా భజరంగ్ పూనియా,తర్వాత సాక్షి మాలిక్ ఆ తర్వాత దీపక్ పునియా పసిడి పట్టు పట్టారు. ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 86కేజీల విభాగంలో పాకిస్తాన్ ఆటగాడు ఇనామ్ పై ఫైనల్లో 3-0 తేడాతో గెలుపొంది స్వర్ణం సాధించాడు దీపక్ పునియా.
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ 62 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కెనడాకు చెందిన అనా గొడినెజ్‌పై విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక భజరంగ్ పూనియా 65 కేసీల విభాగంలో కేనడాకు చెందిన లాచలాన్ మెకనీల్ ను ఓడించి కనక పతకాన్ని దక్కించుకున్నాడు. స్వర్ణాలు సాధించిన ముగ్గురు భారత రెజ్లర్లనూ ప్రధాని మోడీ అభినందించారు. భారత కీర్తి పతాకను రెపరెపలాడించారంటూ ట్వీట్ చేశారు.