తెలంగాణా స్వాధీన దిశగా బిజెపి
posted on Aug 5, 2022 @ 9:11PM
తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగయినా గద్దె దించేయాలన్న పట్టుదలతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులు ఎవ్వరూ కుదురుగా లేరు. అందరూ టీఆర్ ఎస్ పనిపట్టేందుకే తలమునకలై ఉన్నారు. ఇది 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత మరింత పెరిగిందనాలి. బండి సంజయ్ నాయకత్వంలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ, ప్రజల్లో మమేకమై వారిని పార్టీ వైపు తిరిగేలా చేయడంలో ముందుకు సాగుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయ్యేదాకా కాస్తంత నెమ్మదిగా ఉన్న కమలనాథులు ఆ ఫలితాలతో దూకుడు పెంచారు.
అసలు తెలంగాణాలో టీఆర్ ఎస్‌కు టగ్గాఫర్‌గా ఉన్నది గట్టి పోటీనివ్వగలిగిన పార్టీ తమదేనని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. విశేషమేమంటే, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ ఇపుడు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి సారించడం. బీజేపీ అంటేనే ధనికులు, పట్టణవాసులను ఆకట్టుకునే పార్టీ అంటూ టీఆర్ ఎస్ చేసిన కామెంట్లకు విరుద్దంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు.
సంజయ్ పాదయాత్ర చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో ప్రభుత్వ వ్యతిరేక వర్గం బీజేపీ వైపు చూసింది. ఫలితంగా కొన్నిచోట్ల ప్రజలు సంజయ్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల స్పందన, సంజయ్ పాదయాత్రతో జోష్ మీదున్న బీజేపీ క్యాడర్ అమిత్ షా ఎంట్రీతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణాలో పాగా వేయాలన్న లక్ష్యంతో టార్గెట్ తెలంగాణా కార్యక్రమం ఆరంభమయ్యాక, బండి సంజయ్, తెలంగాణా బీజేపీ నాయకులకు కేంద్రం మద్దతు లభిస్తోంది. ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభకు అమిత్ షా రావడం ఇక్కడి పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని రెండింతలు చేసింది. అంతేగాక ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకీ కేంద్ర బీజేపీ నాయకత్వం స్పందించడం గమనార్హం. మొత్తానికి ఏదో విధంగా ఇక్కడి నాయకులతో కేంద్రం టచ్‌లో ఉండడం ప్రజలకు పార్టీ పట్టుదలను, తెలంగాణా పట్ల అభిమానాన్ని తెలియజేసినట్లవుతోంది. ఈ విధంగా పటిష్ట ప్లాన్‌తో తెలంగాణా ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం కలిగేలా చేయడంలో సఫలమవుతున్నారు. ఇటీవల భాగ్యనగరంలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలతోనూ రాష్ట్ర బీజేపీకి తాము అండగా ఉన్నామని మోదీ, అమిత్ షా సంకేతం ఇచ్చారు.
ప్రస్తుతం తెలంగాణాలో మునుగోడు రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువయింది. కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలు ఎలాగయినా మునుగోడును కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నాయి. ఇక్కడ ప్రముఖ రాజకీయనాయకులు, కాంగ్రెస్ సీనియర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి రాజకీయాలను బాగా వేడెక్కించారు. తమ్ముడు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పి అతి త్వరలో బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. అన్నగారూ దాదాపు అదే బాట వేపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలే వినపడుతున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల వెంకట రెడ్డి కినుక వహించారు. రేవంత్ తీరు ఆయనకు బొత్తిగా గిట్టడం లేదు. మీడియాతో మాట్లాడుతూ అసలాయన్న చూడనైనా చూడదల్చుకోలేదని అన్నారు. మరోవంక టీఆర్ ఎస్ మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్‌లో పోరుతో మారు తున్న పరిస్థితులను తమకు అనుకూలం చేసుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇదిలా ఉండగా 21వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణా పర్యటించనున్నారు. ఆయన ఈ పర్యటన వెనుక మునుగోడు చిత్రానికి ఒక ముగింపు ఇవ్వాలని నిర్ధారణకు వచ్చి ఉండవచ్చని విశ్లేషకుల మాట.
ఈ కారణంగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఎక్కడా తగ్గకుండా.. టీఆర్ఎస్ పార్టీపై దూకుడు పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వ తమకు అండగా ఉందన్న ధీమాతో బీజేపీలో చేరాలని ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారు. ప్రజలకు, నేతలకు నమ్మకం కలిగించే బీజేపీ వ్యూహాన్ని ఊహించినదానికంటే ఎక్కువగానే ఇక్కడి బీజేపీ నాయకులు అమలుచేస్తున్నారు.