కోమటిరెడ్డి బాటలో ఇంకెందరు? రేవంత్ రెడ్డే వాళ్ల టార్గెట్టా?
posted on Jan 1, 2021 @ 1:14PM
ఘోర పరాజయాలు, నేతల వలసలతో 2020 సంవత్సరంలో కుదేలైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.. కొత్త ఏడాది కూాడా కలిసొచ్చేలా కనిపించడం లేదు. 2021 న్యూఇయర్ తొలిరోజే హస్తం పార్టీకి షాకిచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏడాది క్రితం జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ తాను బీజేపీలోకి వెళతానని ప్రకటించారు. త్వరలోనే తాను కాషాయ కండువా కప్పుకుంటానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని మరోసారి స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తిరుమల శ్రీవారి సన్నిధిలో కోమటిరెడ్డి చేసిన రాజకీయ ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బీజేపీలోకి వెళతారా లేక ఆయనతో పాటు ఇంకెవరైనా వెళతారాదా అన్నది సస్పెన్స్ గా మారింది.
2020లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అంతేకాదు బీజేపీ కంటే దిగువకు పడిపోయింది. గత సంవత్సరం చాలా మంది పార్టీ నేతలు, కొందరు సీనియర్లు కూడా బీజేపీలో చేరారు. దీంతో తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. పార్టీలో ప్రక్షాళనకు సిద్ధమైంది. కొత్త పీసీసీని నియమించే పనిలో పడింది. పీసీసీ పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఎవరో ఒకరిని పీసీసీ చీఫ్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఖాయమని తెలిసినందు వల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డికి మొదటి నుంచి మంచి సంబంధాలు లేవు. కోమటిరెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వెళతారనే చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే తమకు ఇబ్బంది అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఓటు మొత్తం కమలానికి వెళుతోంది. రేవంత్ పీసీసీ బాస్ గా వస్తే కాంగ్రెస్ బలోపేతం కావడంతో పాటు ప్రజా వ్యతిరేకత ఓటు కొంత అటు వైపు వెళుతోంది. దీంతో తమకు నష్టం కల్గుతుందని భావిస్తున్న బీజేపీ హైకమాండ్... తెలంగాణ కాంగ్రెస్ ను బలహీనం చేయడమే లక్ష్యంగా.. ఆ పార్టీ నేతలను ఆహ్వానిస్తోంది. రేవంత్ కు పీసీసీ వస్తున్నందున.. అందుకు కౌంటర్ గా కమలనాధులు తమ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ కు బలపడే అవకాశం ఇవ్వకుండా.. పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మొదటగా సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి బాటలోనే కొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా కాషాయం గూటికి చేరుతారంటున్నారు. రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత వీహెచ్ తో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా కాంగ్రెస్ నుంచి బయటికి రావచ్చంటున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ ను వ్యతిరేకించే నేతలందరికి బీజేపీ వల వేస్తుందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ వచ్చిన వెంటనే కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు ఉండేలా తెలంగాణ బీజేపీ నేతలు కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది.
మరోవైపు తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా కోమటిరెడ్డి సోదరులు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదని చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన తల్లిగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టారు రాజగోపాల్ రెడ్డి. కాని ఆ కార్యక్రమాలకు తన అన్న వెంకట్ రెడ్డిని ఆయన పిలవలేదు. తన అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి ఎంపీ పరిధిలోనే ఉన్నా..ప్రోటోకాల్ ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి కార్యక్రమాలకు వెంకట్ రెడ్డి వెళ్లలేదు. అప్పడే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు అన్న టీపీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్తానని ప్రకటించడంతో ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని భావిస్తున్నారు.
మొత్తంగా రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. అతనితో పాటు ఇంకా ఎవరెవరు నేతలు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తే.. ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయనే అభిప్రాయం కూడా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరీ బీజేపీ వ్యూహాలకు కాంగ్రెస్ నేతలు ఎలా చెక్ పెడతారో చూడాలి మరీ..