కేసీఆర్ కి కొత్త బిరుదు.. యూటర్న్ ల వీరుడు!!
posted on Jan 1, 2021 @ 9:31AM
"టర్న్ లందు యూటర్న్ లు వేరయ్యా
యూటర్న్ ల్లో కేసీఆరే తోపయ్యా"
అని భవిష్యత్ తరాలు తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి చెప్పుకుంటారేమో అనిపిస్తోంది. అదేదే సినిమాలో చెప్పినట్టుగా "ఈరోజు రైట్ అనిపించింది రేపు రాంగ్ అనిపించొచ్చు. ఈరోజు రాంగ్ అనిపించింది రేపు రైట్ అనిపించొచ్చు" అనే మాటని కేసీఆర్ నిజమని రుజువు చేస్తున్నారు. ముందేమో అబ్బే ఇది అసలు పనికిరాదు అంటారు. కట్ చేస్తే కొన్నిరోజులకి ఇది అమోఘం అంటారు. ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఎన్నెన్నో.. ఆ ఎన్నెన్నోలో ఇప్పుడు కొన్ని యూటర్న్ ల గురించి తెలుసుకుందాం.
తెలంగాణలో రైతులంతా నియంత్రిత సాగు విధానాన్ని పాటించాలని సూచించిన కేసీఆర్.. తరువాత ఆ మాటను వెనక్కు తీసుకున్నారు. రాష్ట్రంలో నియంత్రిత సాగు అవసరం లేదని.. రైతులు ఇక నుంచి తమకు నచ్చిన పంటను పండించవచ్చని.. నచ్చిన చోట అమ్ముకోవచ్చని తాజాగా కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్.. కొన్ని రోజులకే ఆ చట్టాలకు జై కొట్టారు. 'నూతన వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి లాంటి చట్టం. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలి' అని కేసిఆర్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ లో మిగతా పార్టీల కంటే ఉత్సాహంగా టీఆర్ఎస్ పాల్గొంది. టీఆర్ఎస్ కీలక నేతలు, మంత్రులు సైతం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఓ రకంగా అది టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారిక బంద్ గా కనిపించింది. కానీ కొన్నిరోజులకే సీన్ మారిపోయింది. కొత్త చట్టాలకు జై కొడుతూ.. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలని తీసివేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అప్పట్లో 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని అసలు ఎందుకు పనికి రాదన్న కేసీఆర్.. తాజాగా ఈ విషయంలోనూ యూటర్న్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఇక తెలంగాణలోనూ అమల్లోకి రానుంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గతంలో అసెంబ్లీ సాక్షిగా 'ఆయుష్మాన్ భారత్' పై కేసీఆర్ విమర్శలు చేశారు. ఆరోగ్యశ్రీతో పోల్చితే అసలు 'ఆయుష్మాన్ భారత్' దేనికి పనికి రాదన్నారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు 'ఆయుష్మాన్ భారత్' కి ఆహ్వానం పలికారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ కార్డుపై వైద్యం చేయడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు, మరో వైపు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. అందుకే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో మాత్రమే కాదు. పలు విషయాల్లో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. సీఎం కాకముందు నుండి ఇప్పటి వరకు ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత నాయకుడిని సీఎం చేస్తానన్నారు.. ఆయనే సీఎం అయ్యారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. తరువాత ఆ ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. తరువాత అదసలు సాధ్యమేనా? అని ఆయనే రివర్స్ లో క్వశ్చన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో యూటర్న్ లు ఉన్నాయి. అయితే, తాజాగా వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో కేసీఆర్ తీసుకున్న యూటర్న్ మాత్రం.. యూటర్న్ సీఎం అంటూ విమర్శల పాలు చేసింది.