Read more!

రాజీపడిన కోడెల: సత్తెనపల్లి నుంచి పోటీ

 

 

 

చాలామంది తెలుగుదేశం నాయకులు ప్రస్తుతం రాజీనామా బాటలో నడవలేక రాజీబాటలో నడుస్తున్నారు. నిన్నగాక మొన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం కావాల్సిందేనని పట్టుబట్టిన రేవంత్‌రెడ్డి, చంద్రబాబు కాదని అనడంతో పార్టీని వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే తెలుగుదేశం నాయకులు బుజ్జగించి, నచ్చజెప్పిన మీదట కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి అంగకరించారు.


ఇలాంటి పరిస్థితే సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఎదుర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో కోడెల శివప్రసాద్ అంటే నరసరావుపేట. నరసరావుపేట అంటే కోడెల శివప్రసాద్. అలాంటి స్థానాన్ని బీజేపీ పొత్తులో ఇచ్చేయడంతో కోడెల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పొత్తుల్లో ఇవ్వడానికి తన స్థానం తప్ప మరో స్థానం చంద్రబాబుకి దొరకలేదా అని కోడెల మథనపడిపోయారు.

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టేసి అక్కడే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలని డిసైడైపోయారు. అయితే షరా మామూలుగానే పార్టీ నాయకులు కోడెలను బుజ్జగించి శాంతపరిచారు. దాంతో సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి కోడెల అంగీకరించారు. అయితే నరసరావుపేట తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వారిని శాంతపరిచేందుకు కోడెల ప్రయత్నిస్తున్నారు.