కళంకిత మంత్రులు నిర్దోషులని ముఖ్యమంత్రి జడ్జిమెంట్

 

ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రా రెడ్డి ఇద్దరు రాజీనామా చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తాము నిర్దోషులమని, కోర్టు కేసులోంచి త్వరలోనే బయటపడతామని అన్నారు. వారి మాటలను పట్టుకొని వారిరువురూ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ సీబీఐ మరో కొత్త కేసు పెట్టింది. కళంకిత మంత్రుల వ్యవహారం కోర్టులో ఉంది గనుక దానిపై మాట్లాడటం తగదంటూనే సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా అవే అభిప్రాయలు వ్యక్తం చేయడమే కాకుండా కళంకిత మంత్రులందరూ నిర్దోషులని ఆయన జడ్జిమెంటు కూడా ఇచ్చేసారు.

 

శాసనసభలో జరిగే చర్చలు కోర్టు పరిధిలోకి రాకపోవచ్చు గాక, కానీ ముఖ్యమంత్రి ఈ విధంగా శాసన సభ సాక్షిగా తన మంత్రులు నిర్దోషులని, వారికి న్యాయ సహాయం చేస్తామని ప్రకటించడాన్ని సాక్షులను ప్రభావితం చేయవా? అటువంటప్పుడు సీబీఐ ఏవిధంగా స్పందించాలి?

 

ఇక, కాంగ్రెస్ అధిష్టానం కళంకిత మంత్రుల విషయంలో కటినంగా వ్యవహరించి వారికి ఉద్వాసన చెప్పించిన తరువాత కూడా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని ఇంకా వెనకేసుకు రావడం గమనిస్తే, ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయాన్నిఇప్పటికీ వ్యతిరేఖిస్తునట్లు అర్ధం అవుతుంది. మరి దీనిని బట్టి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి కూడా క్రమంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అడుగు జాదలలోనే నడుస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే తానే అన్నవిధంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. మరి ఆయన ధోరణిని కాంగ్రెస్ అధిష్టానం సమర్దిస్తుందా? లేక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఆయన ఈ ధిక్కార ధోరణిని చూసి చూడనట్లు ఊరుకొంటుందా?

 

ఇక శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చించి వాటిని పరిష్కరించవలసిన ముఖ్యమంత్రి మరియు శాసనసభ్యులు అందరూ తమ బాధ్యతలు మరిచి కళంకిత మంత్రులపైనే తీవ్ర వాదోపవాదాలు చేయడం ఎంతవరకు సబబు? దానివల్ల ప్రజలకి ఒరిగేదేమిటి? వారి వారి రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం సభలో ఈ విధంగా గంటలు గంటలు వాగ్వాదాలు చేసుకొంటూ విలువయిన సమయాన్ని, అంతకంటే విలువయిన ప్రజాధనాన్ని వృధా చేయడం విచారకరం.