ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కొట్టేశాడు కోహ్లీ సెంచరీ..!
posted on Sep 9, 2022 6:45AM
ఎన్నాళ్లకెన్నాళ్లకు..విరాటుడి బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈ నాడే ఎదురైందన్నట్లు.. దాదాపు మూడేళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టలేక ఇబ్బందులు పడుతుంటే.. ఆభిమానులు మళ్లీ పూర్వపు ఫామ్ ను ఎప్పుడు అందిపుచ్చుకుంటాడా అని ఎదురు చేస్తున్నారు.
ఆ ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఆసియా కప్ లో భాగంగా గురువారం ఆప్ఘనిస్థాన్ తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ విరాట్ కోహ్లీ అద్బుత బ్యాటింగ్ విన్యాసాలకు వేదికైంది. తనకు మాత్రమే సాధ్యమైన క్లాసిక్ బ్యాటింగ్ మ్యాజిక్ ను కోహ్లీ ప్రదర్శించాడు.
కళ్లు చెదిరే షాట్లతో పరుగుల పండుగ చేసుకున్నాడు. కేవలం 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 61 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 122 పరుగులతో అజేయింగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీకి ఇది 71వ శతకం. టి20లలో కోహ్లీకి ఇది తొలి శతకం. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో టెస్టులో సెంచరీ తరువాత కోహ్లీ సాధించిన తొలి సెంచరీ ఇది. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్ (100) తరువాత పాంటిగ్ (71)తో కలిసి కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
రోహిత్ ఈ మ్యాచ్ ఆడకపోవడంతో కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ ఆకాసమే హద్దుగా చెలరేగాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. అందులో కోహ్లీ స్కోరే 122. రాహుల్ 52 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఛేదనలో ఆప్ఘనిస్థాన్ చేతులెత్తేసింది. భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులతో ఆప్ఘన్ టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు. నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఆప్ఘన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. 101 పరుగుల ఆధిక్యంతో భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఆసియాకప్ నుంచి నిష్క్రమించిన భారత్ కు ఇది ఊరటనిచ్చే విజయం. అయితే ఈ విజయం కంటే కోహ్లీ పూర్వపు ఫామ్ ను అందిపుచ్చుకుని సెంచరీతో చెలరేగడం మాత్రం ఆసియా కప్ విజేతగా నిలిస్తే వచ్చే ఆనందం కంటే ఎన్నో రెట్ల ఆనందాన్నిచ్చింది. కోహ్లీ ఫామ్ ను అందిపుచ్చుకుని సెంచరీతో చెలరేగడం భారత జట్టులోనూ, కోహ్లీ అభిమానుల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరిలోనూ ఆనందాన్ని నింపింది. కోహ్లీని అభినందిస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. డివీలియర్స్ వంటి క్రికెటర్లే కాదు.. ప్రధాని మోడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ వంటి వారు కూడా కోహ్లీని అబినందిస్తూ ట్వీట్లు చేశారు. కోహ్లీ ఈ సెంచరీని తన కుమార్తెకు అంకితం చేశాడు.