సివంగి సాయం అడిగింది...ఆపరేషన్ చేస్తే చిప్ దొరికింది!
posted on Sep 8, 2022 @ 5:19PM
జంతుప్రేమ ఉండవచ్చు.వాటిని పిల్లలతో సమానంగా పెంచనూవచ్చు. దూరంనుంచి ఫోటోలు తీస్తూం డావచ్చు. కానీ సింహం, సివంగి వంటి క్రూరమృగాలతో అంతటి సరదా కష్టమే. క్రూరమృగాలు ఉండే ప్రాంతాలకు వెళ్లేవారు సహజంగా జాగ్రత్తగానే ఉంటారు. వారిలో ఫోటోతీయాలన్న పిచ్చి ఉన్న వారు అత్యుత్సహంతో వాటికి కాస్తంత దగ్గరగా వెళ్లి ఫోటోలు తీయాలనుకుంటే మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి. వాటికి మీరు ఫోటోగ్రాఫర్ ఆనక తెలుగు పత్రికల్లోనో, సైట్‌లోనో ఫోటో వచ్చేస్తుందనుకోవు. అమాంతం మీదపడి చంపుతాయంతే! కానీ జార్జిని మాత్రం సివంగి ఏమీ చేయలేదు. వెనగ్గా వచ్చి కాలుతో వీపు మీద చిన్నదెబ్బవేసింది, ఏదో చిరకాల స్నేహితురాలిలా! అతను ఆశ్చర్యపోయాడు.
వెనక్కి తిరిగి చూడగానే సివంగిని చూసి జార్జ్‌కి ప్రాణం పోయినంత పనయింది. కానీ మరీ అంత కూల్‌గా ఉందేమిటా అని అతనికి అనుమానం వచ్చింది. వెనగ్గా సింహంగారు వచ్చి టిఫిన్ కింద లాగించేస్తా రేమో నన్న భయమూ కలిగింది. కానీ అలా ఏమీ జరగలేదు. సివంగిని పరిశీలనగా చూశాడు జార్జ్. దాని పొట్ట బాగా పెద్దగా ఉంది. ఏకంగా పక్కటెముకల వరకూ! సివంగి ఏదో మెడికల్ సాయం కోరడానికి వచ్చిన పేషెంటులా కనపడింది. కానీ జార్జ్ ఏం చేయగలడు. వెంటనే ఆ ప్రాంతీయుడిని ఒకతన్ని పిలిచాడు. అతనికీ ఈ దృశ్యం మహాఆశ్చర్యపరిచింది. పనిలో పనిగా సివంగి తల నిమిరి, ముద్దెట్టుకుని వెళిపోయా డు!
కొంతసేపటికి అడవి మృగాల సంరక్షణ కేంద్రానికి ఫోన్ చేసి సివంగి గురించి చెప్పాడు జార్జ్. వాళ్లు వచ్చారు. చూస్తే దాని పొట్ట మరీ పెద్దగా ఉందని ఏదో పెద్ద సమస్యేనని తెలుసుకున్నారు. దానికి ముందు మత్తుమందు ఇచ్చి నిద్రపుచ్చారు. తర్వాత పోలీసులు వచ్చి సివంగితో పాటు అధికారులను, జార్జ్‌ని కూడా తీసికెళ్లారు. సివంగిని ఆస్పత్రికి తీసికెళ్లారు. ఆపరేషన్ చేయాలనుకున్నారు. ముందుగా మళ్లీ దానికి మత్తు మందు ఇన్‌జక్షన్ ఇచ్చారు. దాని పొట్టని స్కాన్ చేశారు. కానీ స్పష్టంగా ఏ వస్తువూ పొట్టలో ఉన్నట్టు తెలియలేదు. తర్వాత రెండు గంటలు దానికి విశ్రాంతి నిచ్చారు. మళ్లీ అది బాధతో కదలడం మొదలెట్టింది. ఇక లాభంలేదని వెటనరరీ సర్జన్ ని పిలిచారు. ఆయన తన బృందంతో వచ్చి సివంగికి ఆపరేషన్ చేయాలన్నాడు. చేస్తే ఆఖరికి పొట్టలో ఒక పెద్ద మాంసం ముక్క ఎముకతో పాటు ఇరుక్కు పోయింది. దాన్ని చిన్న సుత్తితో కొట్టారట. దాని కింద ఒక మైక్రోచిప్ కనపడింది. జార్జ్‌తో పాటు డాక్టర్లూ ఆశ్చర్యపోయారు. ఇదెలా సాధ్యమని.
జంతువుల వేటగాళ్లెవరూ సింహాలు బాగా తిరిగే సవానా లో మైక్రోచిప్‌లు పడేసి ఉంటారని అవి మాంసం తో పాటు పడేసి ఉండడంతో ఈ సివంగి మాంసంతో పాటు తిని అది అడ్డుకుని లోపల కదలికలేక కడుపు ఉబ్బిందని తేల్చారు. అధికారులు పోలీసులకు ఈ సంగతి చెప్పారు. వెంటనే సవానా చుట్టూరా వేట గాళ్లకు వలపన్నారు. ఒకరిద్దరు దొరికారట.