గవర్నర్’తో ఘర్షణకు మూడేళ్ళు
posted on Sep 9, 2022 7:20AM
నిజమే కావచ్చును, వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు,, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనే అభిప్రాయమే ప్రముఖంగా వినిపిస్తోంది.
నిజానికి, ముఖ్యమంత్రి ఘర్షణాత్మక వైఖరి అవలబిస్తోంది, ఒక్క గవర్నర్’తో మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, చివరకు నిన్న మొన్నటివరకు 20 సంవత్సరాలకు పైగా తనతో కలిసి నడిచిన, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందేర్’ .. ఇలా, చెప్పుకుంటూ పోతే, ముఖ్యంత్రి వ్యక్తిగత ద్వేషం పెంచుకున్న వ్యక్తుల చిట్టా ఇంకా ఉంటుదని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్’కు తన ముఖం చూడడం కూడా ఇష్టం లేదని, ఈటల రాజేందర్’ ఆరోపించారు. నిజానికి అది ఆరోపణ కాదు, నిజం.
ఈటలను చూడలేక ఆయన్ని, ఆయనతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురినీ, బడ్జెట్ సమావేశాల మొత్తం కాలానికి, సస్పెండ్ చేశారు. ఇక కేవలం మూడు రోజులకు కుదించిన ప్రస్తుత వర్షాకాల సమావేశాలలో పాల్గొనేందుకు కూడా అవకాశం లేకుండా, సాకేతిక కారణాలు చూపించి బడ్జెట్ సమావేశాల సస్పెంన్షన్’ ను వర్షాకాల సమావేశాలకు కూడా పొడిగించారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించలేదు. ముఖం చాటేశారు.
సరే అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్’గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్’ మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు. ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని ఈ సందర్భంగా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని తమిళిసై చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
ఎన్నో యూనివర్సిటీలు, హాస్టళ్లను సందర్శించానని, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని గవర్నర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల చూసి చలించిపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాశానని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించానని తమిళిసై చెప్పారు.నిజానికి,గడచిన మూడు సంవత్సరాలు అనేకంటే, హుజురాబాద్’ పరాభవం మొదలు ముఖ్యమంత్రిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ ఓటమి తర్వాతనే ముఖ్యమంత్రి అటు ప్రధాని మోడీని , ఇటు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’ తో దూరం పెరిగిందని అంటున్నారు.
తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెరిగిన దూరం ఇంకా ఇంకా ముందకు పోతోంది. గడచిన్ రెండేళ్లలో కేవలం, రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి మాత్రమే ముఖ్యమంత్రి రాజ్ భవన్ గదప్ తొక్కారు. మరో వంక స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగానూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ , ముఖ్యమంత్రి ఎవరి దారి వారిది అన్నట్లుగా ఎడముఖం పెడ ముఖంగానే ఉంటున్నారు. చివరకు, రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో, గవర్నర్ ప్రసంగం లేకుండానే సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరో వంక గవర్నర్ ప్రొటోకాల్ వివాదం ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి, ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం సృష్టించాయి. కాగా, రాజ్యాంగబద్ద వ్యవస్థల మధ్య ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదని ఇలాంటి పరిస్థితి చిలికి చిలికి గాలివానగా మారి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేక పోలేదని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.