ఆ కధానాయకుడే కేశవ్ రావుకి దిక్కు

 

దాదాపు మూడు దశాబ్దాలు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్నపటికీ, కే.కేశవ్ రావు తమ పార్టీని సరిగ్గా అంచనా వేయలేకపోయారు. తమ పార్టీ ఇంత త్వరగా తెలంగాణా ఇస్తుందని ఊహించని ఆయన ఏవేవో ఊహించుకొంటూ తెరాసలోకి దూకేశారు. కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్చ, గౌరవం తెరాసలో ఉండదని తెలిసినపటికీ ఆయన తెరాసలోకి దూకేసారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో అనేక కీలక పదవులలో పనిచేసిన ఆయనకు కేసీఆర్ తమ పార్టీలో సెక్రెటరీ జనరల్ అనే పేరు గొప్ప పదవిని కట్టబెట్టి సముచితంగానే గౌరవించారు. దానివల్ల కేశవ్ రావు విలువ పెరిగిందో తరిగిందో ఆయనకే తెలియాలి.

 

అయితే తెరాసలో కేసీఆర్ కుటుంభానికి ఉన్న విలువ మరెవరికీ ఉండదని ఈ పాటికి ఆయనకి అర్ధమయ్యే ఉంటుంది. ఇది వరకులా ఆయన స్వేచ్చగా తన అభిప్రాయలను చెప్పడం కష్టమే!

 

ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏ ఒక్క కధానాయకుడి వల్లో ఏర్పడటం లేదు. అనేక మంది యువకుల బలిదానాలు, ప్రజా పోరాటాల ఫలితంగానే ఏర్పడుతోంది,” అని అన్నారు. మరి ఆయన చెపుతున్న ఆ కధానాయకుడు మరెవరో కాదు. కేసీఆర్ అని అర్ధం అవుతూనే ఉంది.

 

ఒకవైపు తెరాస నేతలు అందరూ కేసీఆర్ ని తెలంగాణా సాధించిన ఘనుడిగా ప్రజలకు చెప్పుకొంటుంటే, మరి అదే పార్టీకి చెందిన కేశవ్ రావు ఈవిధంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తరువాత ఆయన ఎన్ని సంజాయిషీలయినా చెప్పుకోవచ్చు గాక, కానీ ఆయన తన మనసులో మాటను బయటపెట్టినట్లు అర్ధం అవుతోంది. ఆయన ఈవిధంగా మాట్లాడితే తెరాస నేతలకు ఆగ్రహం కలగడం కూడా సహజమే. అందునా కేసీఆర్ కుటుంభ సభ్యులే పార్టీలో ప్రధానపాత్ర పోషిస్తున్నపుడు వారికి కేశవ్ రావు మాటలు మరి కొంత నొప్పి కలిగించడం కూడా సహజమే.

 

అందుకే, కేసీఆర్ కుమారుడు కే.తారక రామారావు మాట్లాడుతూ ఎవరు అవునన్నా, కాదన్నాతెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లి, తెలంగాణా సాదించిన ఘనత పార్టీ అధినేత చంద్రశేఖరరావుకే దక్కుతుందని ఆయన ఘాటుగా జవాబిచ్చారు.

 

ఒకవేళ కేశవరావుకి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకొనే ఉద్దేశ్యం లేనట్లయితే, మరికొంత కాలం తెరసలోనే కొనసాగాలని అనుకొంటే, ఈ విధంగా నోరు జారకుండా ఉంటే మేలేమో! ఆయన తెరాసలో కొంచెం జాగ్రత్తగా మెసులుకొంటే కాంగ్రెస్ పార్టీని వదులుకొని వచ్చినందుకు ప్రతిఫలంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయనకు కేసీఆర్ మంచి పదవి ఏదయినా కట్టబెట్టవచ్చును.