కేరళ ఏనుగు ఘటనలో కొత్త కోణం
posted on Jun 9, 2020 @ 9:32AM
కేరళ రాష్ట్రంలో పేలుడు పదార్థాలు నింపిన పండు తిని గర్భంతో ఉన్న ఏనుగు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఏనుగు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.
అడవి పందుల నుంచి పంటపొలాలలను కాపాడుకునేందుకు కొందరు స్థానికులు ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన పండ్లను ఎరగా వేస్తారని, అటువంటి ఒక పండునే ఈ ఏనుగు తిన్నదని పర్యావరణ శాఖ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని పర్యావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ఎవరిదీ ఉద్దేశపూర్వక తప్పు లేదని, అయినప్పటికీ, నిందితులను వదిలేది లేదని స్పష్టం చేసింది. ఏనుగు మరణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకుని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని పర్యావరణ శాఖ తెలిపింది.