డాక్టర్ అనితారాణి వ్యవహారంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం.. ఇంతలోనే ట్విస్ట్!!
posted on Jun 8, 2020 @ 6:27PM
తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ డాక్టర్ అనితారాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, డాక్టర్ అనితారాణి వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై నిజానిజాలేంటో తేల్చాలంటూ సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఓ వైపు సీఎం ఆమె వ్యవహారంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశిస్తే, మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియా వేదికగా వైద్య ఆరోగ్యశాఖపై అసత్య ప్రచారం చేశారంటూ డాక్టర్ అనితారాణిని అధికారులు సస్పెండ్ చేశారు. అనితారాణి మానసిక స్థితి సరిగా లేదని చిత్తూరు జిల్లా వైద్యాధికారి పెంచలయ్య చెబుతున్నారు. ఇప్పటివరకు పనిచేసిన ప్రతిచోట తన తీరుతో వివాదాస్పదమయ్యారని, ఇప్పటికే పలుమార్లు సస్పెండ్ అయ్యారని తెలిపారు. అనితారాణిపై గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, రోగులతో కూడా గొడవలు పెట్టుకునేవారని పెంచలయ్య తెలిపారు. గతంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పని చేసినప్పుడు ఆరు నెలలకు మించి ఆమె ఎక్కడ పని చేయలేదని గుర్తు చేశారు. డాక్టర్ అనితారాణి ఆరోపణలు అవాస్తవమని పెంచలయ్య కొట్టిపారేశారు.
అయితే అనితారాణి వ్యవహారంపై సీఎం సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేయటం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.