సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ!!
posted on Jun 9, 2020 @ 9:56AM
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సినిమా, టీవీ షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు నేడు సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి నేతృత్వంలోని సినీ బృందం భేటీ కానుంది. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, జీవిత, సి.కళ్యాణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్లలో ప్రదర్శనలు వంటి అంశాలపై వారు సీఎం జగన్ తో చర్చించనున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో షూటింగ్ లకు అనుమతినిచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా షూటింగ్ లకు అనుమతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే థియేటర్లలో ప్రదర్శనలకు మాత్రం ఇప్పుడే అనుమతినిచ్చే అవకాశం కనిపించడంలేదు.