దూరపు కొండలు నునుపు
posted on May 1, 2023 @ 1:59PM
తెలుగువాడి ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే తెలుగు దేశం పార్టీలో డిప్యూటి స్పీకర్ స్థాయికి ఎదిగిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా కార్డుతో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కేసీఆర్ తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పాదాల వద్ద తనకొడుకును పడుకోబెట్టి సర్ మీ పేరు నా కొడుక్కు పెట్టుకుంటానని తన అభిమానం చాటుకున్నారు. ఎన్టీఆర్ పేరు వచ్చేలా తారకరామారావు అనిపెట్టుకుని తెలుగుదేశానికి దగ్గరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాకు అన్యాయం జరుగుతుందని ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని చేపట్టి అధికారంలో వచ్చిన కేసీఆర్ ఇపుడు నేషనల్ కార్డుతో భారత రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు. తప్పేంలేదు. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదగడానికి ఎత్తుగడలు వేసి జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపితే ఎవరైనా హర్షించాల్సిందే. కానీ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లిన ఈ లోకల్ మీడియాపై చిర్రుబిర్రులాడటం కేసీఆర్ అవకాశ వాదానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవంలో లోకల్ మీడియాకే ఎంట్రీ లేకపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. ఆవేదన పరిచింది. అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బీబీసీకి అన్యాయం జరిగిందని, మోడీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని సచివాలయ ప్రారంభోత్సవంలో ఆరోపించారు. మరి తాను చేస్తున్న పని ఏమిటి? బీబీసీతో సహా ఉత్తర భారత దేశానికి చెందిన మీడియాను సాదరంగా ఆహ్వానించి మనవాళ్లను గేట్ బయటికి గెంటేసారు. నేషనల్ మీడియా వాళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన చిన్నా చితకా చానెల్స్ కు ప్రత్యేక బైట్స్ కూడా ఇచ్చారు. కేసీఆర్ వారిని ఇంతలా ప్రోత్సహించడానికి ఒకే ఒక ఎలిమెంట్ నాన్ లోకల్ మీడియా. కొత్తగా ఏర్పాటు అయిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ చేయొద్దు అనుకుంటుందా? ఎన్నికల ముందు తాను మేనేజ్ చేయగలనని కేసీఆర్ భావిస్తున్నారా? ఏమిటో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్. కేసీఆర్ కు ముందు నుంచి మీడియా అంటే లెక్కలేదు. జర్నలిస్ట్ లు అంటే గౌరవం లేదు. హిందూ పత్రికలో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ తో ఉన్న చనువుతో ప్రెస్ కాన్షరెన్స్ లోనే అవమానించి వార్తల్లో కెక్కారు కేసీఆర్. ప్రశ్నలు వేసిన రాహూల్ నే అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరు తెలుగునాట ఇప్పటికీ యూట్యూబ్ చానల్స్ లో చెక్కర్లు కొడుతూనే ఉంది. కేటీఆర్ కూడా అంతే. ఇటీవలె ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రశ్నించిన తెలంగాణ జర్నలిస్ట్ ను నాలుగు కోట్ల మంది టీఆర్ఎస్ ను గెలిపించారు. నిన్ను గెలిపించారా. ఏ మీడియా నువ్వు అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే అవమానపరిచారు. చాలా కాలం నుంచి కేసీఆర్, కేటీఆర్ ను లోకల్ మీడియా ప్రశ్నించడం మానేసింది. ఇంగ్లీష్, హిందీ లో ప్రశ్నలు వేసిన జర్నలిస్టులకు తండ్రీ కొడుకులు ఎంతో ఓపిక, సహనంతో జవాబులు చెబుతారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ఆర్ ప్రభుత్వం జవహార్లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీకి కేటాయించిన 70 ఎకరాల భూమి లబ్దిదారులకు నేటి వరకు అందలేదు. సుప్రీంకోర్టు తుదితీర్పు ఇచ్చినప్పటికీ ఆ భూముల అప్పగింతలో తెలంగాణ ప్రభుత్వం మీనమీషాలులెక్కపెడుతుంది.‘‘మాది రాజకీయ పార్టీ. సుప్రీం తీర్పును అమలు పరచలేమని బయట ఉన్న జర్నలిస్టులు ఊరుకోరు’’ అని అసెంబ్లీ లాబీలో కేసీఆర్ తనయ కేటీఆర్ బాహాటంగా సెలవిచ్చారు. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత థాంక్స్ చెబుదామని అనుకున్న జర్నలిస్ట్ నాయకులకు కేసీఆర్ అపాయింట్ ఇవ్వడం లేదు. అదే నేషనల్ మీడియా, పొరుగు రాష్ట్రాలైన మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మీడియా సంస్థలకు గంటల తరబడి కేసీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ప్రాంతాలకు చెందిన యూ ట్యూబ్ చానల్స్ లో కేసీఆర్ ఇంటర్యూలు ప్రసారమవుతున్నాయి. తెలుగు మీడియాను అనధికారికంగా బీఆర్ఎస్ బహిష్కరించింది. ఎందుకో ఈ డిస్క్రిమినేన్. దూరపు కొండలు నునుపు అంటే ఇదేనేమో.