మేడేకు నిజమైన సార్ధకత ఎప్పుడంటే?
posted on May 1, 2023 @ 12:30PM
కార్మికుల పోరాటాల్లో నుంచి ఉద్భవించినదే మేడే .ఏటా కార్మిక దినోత్సవాలు జరుపుకుంటున్నా.. స్వేదం చిందిస్తున్న కార్మికులను ఇంకా బానిసలుగా చూస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మిద్దెలు, మేడలూ కడుతున్న కార్మికులకు నేటికీ గూడు లేని దుస్థితి. వ్యవసాయం నుంచి మొదలు పెడితే కార్మికుల స్వేదం చిందని రంగం ఏదీ లేదంటే అతివయోక్తి కాదు.
సర్వసంపదలు సృష్టించే శ్రామిక వర్గం దుర్బర దారిద్ర్యంతో కునారిల్లుతోంది. మేడే అనగానే గుర్తుకు వచ్చేది కార్మిక వర్గమే. వారు లేనిదే పరిశ్రమలు లేవు..జీవనం లేదు.. ఏటా మేడేలు జరుపుకుంటున్నా వారిని ఆదరించే తీరులో మాత్రం దశాబ్దాులుగా, శతాబ్దాలుగా ఎటువంటి మార్పూ కానరావడం లేదు. నేటికీ కార్మికులు బానిసలు బతుకిడుస్తున్నారు. కార్మిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. చట్టాలు పరిశ్రమల యాజమాన్యాలకు చుట్టాలుగా మారుతున్నాయి. కనీస వేతనాలు, అమలు కావడం లేదు. పనిదినాలు, పనిగంటలు పోరాడి సాధించుకున్న హక్కులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దేశంలో కార్మికులను అణచివేసే యాజమాన్యాలకే ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి. యాజమాన్యాలకే ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్న కారణంగా కార్మికసంక్షేమం మేడిపండు చందంగా మారిపోయింది.
కార్మికులు తమ స్వేదాన్ని రక్తంగా చిందించి లాభాలు తెచ్చి పెడుతున్నా వారికి జీవనంలో కానీ, పని పరిస్ధితుల్లో కానీ, పని ప్రదేశాల్లో నేటికీ కనీస వసతులు లేని పరిస్థితి, కనీస వేతనాలు అమలు కాని దుస్థితే ఉంది. ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక హక్కులు సాధించుకున్నా.. వాటి అమలు మాత్రం గాలిలో దీపంగానే ఉంది. 8 గంటల పని హక్కు కోసం ప్రాణాలు ధారపోసి, నాటి ప్రభుత్వాల మెడలు వంచి సాధించుకున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. తమ డిమాండ్లపై నినదించిన వారిని తక్షణం ఉద్యోగాల నుంచి తొలగస్తున్నారు. ఉద్యోగా లు తొలగించినా... నోటీసులు ఇవ్వకున్నా కార్మిక సంక్షేమ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. కార్మికుల పిల్లలకు విద్యా,ఉద్యోగ సౌకర్యాల కల్పన లేదు. వారికి ఆరోగ్య సమస్యలపై పట్టింపు లేదు. అలాగే అర్థాంతరంగా కంపెనీలను, సంస్థలను మూసేసి కార్మికలు నోట్లో మట్టి కొడుతున్నా చట్టాలు పని కార్మికులను అణచివేసేందుకు యాజమాన్యాలు కొత్తకొత్త పద్దతులను అనుసరిస్తున్నాయి.
యాజమాన్యా లకు వత్తాసు పలికే విధానానలను ప్రభుత్వాలు విడనాడాలి. అప్పుడే మేడేకు సార్థకత. పారిశ్రామికీకరణ తరవాత కూడా మార్పులు రావడం లేదు. కార్మాకులకు హక్కులు లేకుండా చేస్తున్న యాజామన్యాలకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలు తీసుకు వస్తున్నాయి. పక్కాగా శ్రామిక చట్టాలు అమలు చేసి వారికి అండగా నిలవాలి. కార్మిక హక్కులు, పోరాటాలు, త్యాగంతోనే సాధ్యం అయ్యాయి. కానీ ప్రభుత్వాలు కార్నొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ..కార్మికులకు ద్రోహం చేస్తున్నాయి. కనీస పని గంటలు, కనీస వేతనాలు అమలు కావడం లేదు. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే మేడే కు సార్థకత.