రజనీకాంత్ పై విమర్శలతో వైసీపీ ప్రతిష్ట పాతాళానికి
posted on May 1, 2023 @ 1:49PM
రజనీ కాంత్ పై వైసీపీ విమర్శలపై సహజంగానే దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రజనీకాంత్ కు ఏపీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. ఈ డిమాండ్ ఏదో తమిళుల నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో కాదు.. దేశం నలుమూలల నుంచీ వినవస్తోంది. సమాజాక మాధ్యమం అయితే.. వైసీపీ ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతోందనీ, ఆ మాటల్లో విమర్శల్లో వైసీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ ప్రస్ఫుటంగా బయటపడుతోందనీ సామాజిక మాధ్యమంలో విస్తృత చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవంలో పాల్గొనేందుకు బెజవాడ వచ్చిన రజనీ కాంత్ తన ప్రసంగం మొత్తంలో ఎక్కడా వైసీపీ పేరు కానీ, జగన్ మాట కానీ ఎత్తలేదనీ, కేవలం చంద్రబాబు విజన్ ను, ఎన్టీఆర్ ఔన్నత్యాన్నీ మాత్రమే ప్రశంసించారనీ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు విజన్ గురించి రజనీకాంత్ ప్రస్తావించడంతోనే వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా వైసీపీ నేతలు గాభరా పడటం వారిలోని భయాన్ని ఎత్తి చూపిందని అంటున్నారు. 2024 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించి సీఎం అయితే ఏపీ నంబర్ వన్ అవుతుందన్నది ఒక్క రజనీకాంత్ అభిప్రాయం మాత్రమే కాదనీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా అదే అభిప్రాయంతో ఉన్నారనీ అంటున్నారు.
అంతెందుకు ప్రభుత్వ విజయాలను బాకా ఊదుకోవడానికి గడప గడపకూ అంటూ వెళుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎదురౌతున్న ప్రజా వ్యతిరేకత, నరసనల సెగలే.. జగన్ పాలన ఎంత సుందరముదనష్టంగా సాగుతోందో అర్దమైపోతోందని నెటిజన్లు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అంతెందుకు జగన్ ప్రసంగాలకు, పథకాలకు, సొమ్ముల పందేరాననికీ జనం చప్పట్లు కొట్టడం లేదంటూ సీనియర్ వైసీపీ నేత.. మంత్రి ధర్మాన జనంపైనే చిర్రుబుర్రులాడటంతోనే వైసీపీ పాలన పట్ల, జగన్ తీరు పట్ల సొంత పార్టీలోనే.. ఎంత అసహనం వ్యతిరేకత ఉందో అర్థమౌతోందని అంటున్నారు.
అధికారం చేజారిపోతోందన్న ఆందోళన వైసీపీ నేతలలో అసహనానికీ, ఫ్రస్ట్రేషన్ కు కారణమౌతోందని, దాంతోనే విచక్షణ మరచి ఎవరిని పడితే వారిని, ఎలా పడితే అలా విమర్శస్తూ తమ వాచాలతను ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతల ఈ తీరు వారి ప్రతిష్టను, పార్టీ పరువును మరింత దిగజారు స్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.