సారువారి మాటలకూ అర్థాలె వేరులే.. అర్ధాలె వేరులే
posted on Aug 16, 2022 @ 12:17PM
కేసీఆర్ చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు అని ఆయన ప్రత్యర్థులు, రాజకీయ వ్యతిరేకులు అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ వ్యూహాలు కూడా ఉంటాయి. ఆయన ఏదైతే చెబుతారో దానికి అమలు చేయరు.. అమలు చేయకపోవడమే కాదు.. తన వాగ్ధాటితో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించే వారి నోళ్లు మూయించడమే కాదు..సామాన్యులు ఆయనను అలా ఎలా ప్రశ్నిస్తారు అని ఆశ్చర్య పోయేలా చేస్తారు.
ప్రత్యేక తెలంగాణకు తొలి సీఎంగా దళితుడిని పీఠం ఎక్కిస్తానని ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానాన్ని, చెప్పిన మాటను కాదనీ, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి అయ్యారు. అదేమని అడిగిన వారికి కొత్త రాష్ట్రం అనుభవజ్ణుడు అయిన ముఖ్యమంత్రి అవసరం కనుక తాను ఈ పీఠం అధిరోహించానని చెప్పారు. రాష్ట్రంలో భూమి లేని రైతులందరికీ మూడెకరాల భూమి అని వాగ్దానం చేసి ఆనక రాష్ట్రంలో పంచేందుకు అంత భూమి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇలా ఏ వాగ్దానం తీసుకున్నా కేసీఆర్ ది అదే తంతు. ఇప్పుడు తాజాగా ఆయన రాజ్ భవన్ తో ప్రగతి భవన్ కు ఉన్న అగాధాన్ని మరింత ప్రస్ఫుటంగా చాటేలా మరో సారి మాట తప్పారు. చెప్పేదొకటి.. చేసేదొకటి తన విధానమని చాటారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఎట్ హోం విందు కర్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. అయితే మామూలుగా అయితే అదో విషయమూ కాదు, విశేషమూ కాదు. కానీ కేసీఆర్ ఈ కార్యక్ర్మానికి హాజరౌతున్నారని రాజ్ భవన్ కు సమాచారం అందింది. స్వయంగా ఆయనే ఈ సమాచారాన్ని పంపారు. కానీ ఆయనీ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దాదాపు 20 నిముషాల సేపు ఆయన కోసం గవర్నర్, ఇతర ముఖ్యులు వేచి చూశారు. అప్పుడు తాపీగా కేసీఆర్ రావడం లేదనీ, ఆయన ఎట్ హోమ్ కు హాజరయ్యే కార్యక్రమం రద్దైందని సమాచారం వచ్చింది.
ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భాలలో రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ పేరుతో గవర్నర్ ఇస్తూంటారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్తుంది. అందరూ పాల్గొంటూ ఉంటారు. ఇదొర సాంప్రదాయంగా వస్తూనే ఉంది. గవర్నర్‌తో అభిప్రాయభేదాలు ఉన్నా.. ఇలాంటి సందర్భంలో వాటిని పట్టించుకోకుండా హాజరవ్వడం మర్యాద. అయితే కేసీఆర్ ఆ కనీస మర్యాదను కూడా పాటించలేదు. ఆయన గవర్నర్ ను తన చర్య ద్వారా అవమానించానని భావించి ఉండవచ్చు. కానీ వాస్తవానికి ఆయన అవమానించింది. సంప్రదాయాన్ని, వ్యవస్థను, రాజ్ భవన్ ను అని పరిశీలకులు అంటున్నారు.