కేసీఆర్ వ్యాఖ్యలు ‘బ్రాండ్ తెలంగాణ’కి బ్యాడ్ చేశాయా?
posted on Sep 12, 2014 @ 1:46PM
‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది’ అనే మాట ఎప్పుడు ఏ మహానుభావుడు చెప్పాడో గానీ, ఆ మహానుభావుడికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ మాట అక్షరాలా సత్యమని చెప్పే సంఘటనలు ఈ ప్రపంచంలో నిరంతరం కనిపిస్తూనే వుంటాయి. ఇప్పుడు తెలుగు ప్రజలకు తాజాగా కనిపిస్తున్న రివర్స్ ఉదాహరణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణమైన ఆయన మీద తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన తెలంగాణని ‘బంగారు తెలంగాణ’గా మారుస్తారని ఆశించారు. అందుకే ఎన్నికలలో ఆయనకి అధికారం ఇచ్చారు. తెలంగాణ ‘బ్రాండ్’ని విశ్వవిఖ్యాతం చేస్తానని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిన మాటలు విని మురిసిపోయారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వందరోజులు పూర్తయినా హామీల వర్షం కురిపించడమే తప్ప, ఆవగింజంతయిన అభివృద్ధి జరగకపోయినా కేసీఆర్ మీద ప్రజల నమ్మకం ఎంతమాత్రం సడలలేదు. కానీ పరిపాలన వందరోజులు పూర్తయిన ఉత్సాహంలోనో, తనకు తిరుగేలేదన్న ఆత్మవిశ్వాసంలోనో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు వికటించాయి. ‘బ్రాండ్ తెలంగాణ’ సంగతి అటుంచితే, తెలంగాణ ఇమేజ్‌ని జాతీయ స్థాయిలో దెబ్బతీశాయి.
వరంగల్‌లో జరిగిన కాళోజీ శతజయంతి సభలో కేసీఆర్ మీడియా మీద, జర్నలిస్టుల మీద చేసిన వ్యాఖ్యలు ఆ సభలో పాల్గొన్న కొంతమంది అత్యుత్సాహ పరుల చేత చప్పట్లు కొట్టించి వుండొచ్చుగానీ, అవి జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీశాయి. తెలంగాణలో వుండాలంటే మాకు సెల్యూట్ చేయాలి, మెడలు విరిచేస్తాం, పది కిలోమీటర్ల లోతున గొయ్యి తీసి పాతిపెడతాం లాంటి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఒక ముఖ్యమంత్రిని కాకుండా ఒక ఉద్యమకారుడిని చూపించాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటల్లా కాకుండా ఒక ముఠా నాయకుడు మాట్లాడిన మాటల్లా వున్నాయన్న అభిప్రాయాలు జాతీయ స్థాయిలో వ్యక్తమయ్యాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద జాతీయ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అన్ని జాతీయ ఛానళ్ళు కేసీఆర్ వ్యవహారశైలిని, ఆయన మాట్లాడిన మాటల్ని చీల్చి చెండాడేశాయి. టైమ్స్ నౌ ఛానల్లో అర్నబ్ గోస్వామి అయితే కేసీఆర్ వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ జర్నలిస్టుల్ని ఎలా చంపుతారు? ఎలా మెడలు విరుస్తారు? ఎంతమందిని చంపుతారు? కేసీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలి... కేసీఆర్ మీద హత్యాయత్నం కేసులు పెట్టాలి... లేదా ఆయనకు మతిస్థిమితం లేదని ప్రకటించాలి అంటూ రాజ్యాంగంలోని చట్టాలను కూడా ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఛానల్ చర్చలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్‌ని అయితే దులిపిపారేశారు. సీమాంధ్రుల మీద నోరు వేసుకుని పడిపోయే వినోద్ కుమార్ కూడా ఆర్నబ్ గోస్వామి ముందు నోరెత్తలేక నీళ్ళు నమిలారు. మిగతా జాతీయ ఛానల్స్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించాయి. ఆయా ఛానళ్ళ చర్చలో పాల్గొన్న కవిత లాంటి టీఆర్ఎస్ నాయకులు బిత్తరపోయేలా స్పందించాయి.
కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, వాటికి జాతీయ స్థాయిలో వ్యతిరేకత రావడం, జాతీయ స్థాయి మీడియా కేసీఆర్ని తీవ్రంగా విమర్శించడం.... ఇక్కడితో ఈ ఇష్యూ ముగిసిపోలేదు. మొత్తమ్మీద ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఇమేజ్‌కే డ్యామేజ్ చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ ఇమేజ్ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల కలలను కేసీఆర్ వ్యాఖ్యలు కల్లలు చేసే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇలాంటి వ్యవహారశైలి ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పలు ప్రఖ్యాత సంస్థలు పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేవి. ఇప్పుడు రాష్ట్ర విభజన పుణ్యం, టీఆర్ఎస్ నాయకుల తిట్ల పుణ్యమా అని సీమాంధ్ర నుంచి ఒక్క పైసా కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కేసీఆర్ వ్యవహారశైలి, మాటలు దేశంలోని ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చే అంశాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఇప్పటికైనా ఈ ముప్పును గ్రహించి కేసీఆర్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని లేకపోతే ‘బ్రాండ్ తెలంగాణ’ని మరచిపోవాల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.మన నోటిలో వున్న మాటకి మనం రాజులం.. మన నోరు దాటిన మాటకి మనం బానిసలం. నోరు తెరిస్తే బోలెడన్ని కవితలు, సామెతలు చెప్పే కేసీఆర్ గారికి ఈ సామెత తెలియకుండా వుంటుందా?