దాని గురించి ఆయనకు ముందే తెలుసట!
posted on Sep 12, 2014 @ 11:57AM
యుగయుగాలుగా ప్రజలు రామాయణ, మహాభారత కధలను చదువుతూనే ఉన్నా నేటికీ వాటి నుండి ఎప్పుడూ ఏదో ఒక తెలియని కొత్త షయం బయటపడుతూనే ఉంటుంది. అది మనుషులను సన్మార్గంవైపు నడిపేందుకు దోహదపడుతోంది. పదేళ్ళ పాటు దేశాన్ని ఏలిన గత కాంగ్రెస్ పాలనలో కూడా అనేక అవినీతి భాగోతాలు బయటపడ్డాయి. ఇంకా నేటికీ బయటపడుతూనే ఉన్నాయి. అయితే అవన్నీ జరిగిన తప్పులను నెమరు వేసుకోవడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడవని అందరికీ తెలుసు.
ఉన్నత స్థాయిలో జరిగిన ఆ అవినీతి భాగోతాలలో నిందితులలో ఎ ఒక్కరికీ ఇంత వరకు శిక్ష పడలేదు. బహుశః పడే అవకాశం కూడా లేదనే భావించవచ్చును. వందలు, వేల కోట్ల ప్రజాధనం బొక్కేసిన నేతలు,అధికారులు, పారిశ్రామిక వేత్తలు ఒకటి, రెండేళ్ళు జైలులో గడిపితే దానినీ త్యాగమనుకొనే రోజులివి. ఆ అపూర్వ త్యాగధనులని ప్రజలే భుజానికేత్తుకొని మోస్తుంటే, వారు చట్ట సభలను తమ చేతులలోకి తీసుకొంటే ఆశ్చర్యం ఏముంది? వారు సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవడంలో వింతేమి ఉంది?
ఇక విషయంలోకి వస్తే గత యూపీయే పాలనలో వెలుగు చూసిన అనేక కుంభకోణాలలో 2జి కుంభకోణం చాలా అమూల్యమయినది. ఎందుకంటే స్పెక్ట్రం అంటే అంతా గాలే. కంటికి కనపడే వస్తువు కాదు. ఆ టెలిఫోన్, ఇంటర్నెట్ తరంగాలలాగే ఎన్నిలక్షల కోట్లు చేతులు మారాయో కూడా ఎవరికీ కనపడదు. ఏనుగుకి పైకి కనబడే దంతాలు కేవలం ప్రదర్శనకే కానీ దేనినయినా నమిలి పారేయగల అసలు దంతాలు లోపల వేరే ఉన్నట్లే, ఈ కుంభకోణంలో కూడా ఒకటో రెండో లక్షల కోట్లు అవినీతి జరిగినట్లు అతి కష్టం మీద కనుగొనగలిగారు. కానీ మొత్తం ఎన్ని లక్షల కోట్లు మింగేసారనే విషయం నేటికీ చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది.
మొదటగా ఈ అవినీతిని బయటపెట్టిన కాగ్ మాజీ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ యూపీయే ప్రభుత్వం గురించి మళ్ళీ మరికొన్ని గొప్ప విషయాలు బయట పెట్టారు. 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో జరుగుతున్న అవినీతి గురించి మాజీ ప్రధాని డా.మన్మొహన్ సింగ్ కు పూర్తిగా తెలుసునని, అదే విషయాన్ని నాటి కేంద్రమంత్రి కమల్ నాద్ తో సహా ఆయనను చాలా ముందే హెచ్చరించినప్పటికీ ఆయన దానిపై వెంటనే చర్యలు చెప్పట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు నిర్లిప్తంగా కూర్చొని, పరోక్షంగా ఈ అవినీతికి సహకరించారని ఆరోపించారు.
దయానిధీ మారన్ టెలికాం మంత్రిగా ఉన్నప్పటి నుండి సాగుతున్న ఈ అవినీతి భాగోతం గురించి ఆ తరువాత ఆ బాధ్యతలు చేప్పట్టిన ఎ.రాజా మాజీ ప్రధాని డా.మన్మొహన్ సింగ్ కు పూర్తిగా వివరించడమే కాకుండా దానిని తను కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా చెప్పిన తరువాత కూడా ఆయన స్పందించలేదనే సంగతిని వినోద్ రాయ్ బయటపెట్టారు. అంతే కాదు.. తను తయారు చేసిన కాగ్ నివేదికలో డా.మన్మొహన్ సింగ్ పేరును, ఈ విషయాన్ని ప్రస్తావించవద్దని తనపై సీనియర్ కాంగ్రెస్ నేతలు అశ్వినీ కుమార్, సంజయ్ నిరుపం మరియు సంజయ్ దీక్షిత్ లు ఒత్తిడి చేసారని వినోద్ రాయ్ తెలిపారు. ఒకవేళ ప్రధాని తలుచుకొంటే ఈ అతిపెద్ద కుంభకోణం జరగకుండా నివారించగలిగేవారని కానీ ఆయన మౌనం వహించడం ద్వారా దానికి ఆమోదం తెలిపినట్లయిందని వినోద్ రాయ్ తెలిపారు.
వినోద్ రాయ్ వ్రాసిన ‘నాట్ జస్ట్ యాన్ అకౌంట్’ అనే పుస్తకం త్వరలో విడుదల కానుంది. అందులో ఇటువంటి గొప్ప గొప్ప విశేషాలు మరిన్ని బయటపడవచ్చును. అయితే దోషులు ఎవరూ శిక్షింపబడే అవకాశము లేదు. వారు దిగ మింగిన లక్షల కోట్ల ప్రజాధనం కక్కించగల సత్తా మన చట్టాలకు లేవు. అందువలన ఇదంతా చదువుకొని భారంగా ఒక నిటూర్పు విడవడటం కంటే మనం చేయగలిగిందేమీ లేదు.