నయా సైబర్ నేరం.. యువతికి రూ.20లక్షలు టోకరా
posted on Aug 2, 2023 @ 5:32PM
సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్ గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా జనంలో మాత్రం అవగాహన పెరగడం లేదు. పైగా ఈ తరహా మోసాలలో బాధితులుగా ఉంటున్న వారిలో అత్యధికులు ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. అందులోనూ ఐటీ కొలువులలో ఉండే వారే ఎక్కువగా సైబర్ మోసాలకు గురి అవుతున్నారు. తాజాగా యువతి సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న ఒక యువతి ఈ తరహా మోసానికి గురై రమారమి 20 లక్షలు పోగొట్టుకుంది. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఆ యువతికి జులై 26న ఓ ఫోన్ కాల్ వచ్చింది. స్మిత పేరుతో పరిచయం చేసుకున్న ఓ మహిళ ఆ ఫోన్ లో మీ పేరిట మలేసియాకు పంపిన పార్సిల్ ముంబయికి తిరిగొచ్చిందనీ, ఆ పార్శిల్ లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పింది. దాంతో షాక్ తిన్న బాధితురాలు ఆ పార్సిల్‌తో తనకు సంబంధం లేదని చెప్పింది. అయితే ముంబై కస్టమ్స్ అధికారులతో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని గూగుల్ మీట్ ద్వారా లైన్లోకి తీసుకు వచ్చింది. ముంబై కస్టమ్స్ కమిషనర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ భయపెట్టిన ఆ వ్యక్తి ఆమె ఆధార్ కార్డు వివరాలు తీసుకున్నాడు.
ఆధార్ ఐడీ తనిఖీ చేశామనీ, హవాలా లావాదేవీల కేసు ఉన్నట్లు తెలిసిందని, బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తామంటూ బాధితురాలి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత సీబీఐ అధికారి పేరిట మరో వ్యక్తి వీడియోకాల్‌లో లైన్లోకి వచ్చాడు. బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని.. మొత్తం మీ కుటుంబం సమస్యల్లో చిక్కుకుంటుందని ఆ యువతిని భయపెట్టాడు. ఈ కేసులో మూడేళ్లు జైలుశిక్ష పడుతుందని.. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు వినాలన్నాడు.
అప్పటికే తీవ్రంగా భయాందోళనలకు గురైన బాధితురాలు అతను చెప్పిన విధంగా ఓ బ్యాంకు యాప్ ద్వారా అప్పటి కప్పుడు రూ.19.94 లక్షల లోన్‌కు అప్లై చేసింది. ఆ సొమ్ము రాగానే తాను చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనీ, 10 నిమిషాల తర్వాత హైదరాబాద్ సీబీఐ అధికారులు మీ ఇంటికొచ్చి డ్రగ్స్ పార్సిల్ పంపలేదని ఒప్పందం చేసుకుంటారని ఆ యువతిని నమ్మించారు. ఆ యువతి వారు చెప్పినట్లుగానే రూ.19.94 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దాదాపు మూడు గంటలు ఫోన్లో మాట్లాడిన నిందితులు.. డబ్బు వాళ్ల అకౌంట్‌లో పడగానే కాల్ కట్ చేశారు. ఎంత సేపు ఎదురుచూసినా.. సీబీఐ బృందం తన ఇంటికి రాకపోవటంతో యువతికి తాను మోసపోయానని అర్ధమైంది. వెంటనే సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చదువుకున్నవారు ఇలాంటి మోసాల బారినపడటం ఆందోళన కలిగిస్తోందని పోలీసులు అంటున్నారు. ఇలాంటి కాల్స్, మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.