తెలంగాణాలో ‘సూపర్ పవర్’గా కెసిఆర్ ప్రయత్నాలు?

 

 

 

 

ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా విషయంఫై అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఆధారంగా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుపోవచ్చని భావిస్తున్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్ర శేఖర రావు ఇదే అదనుగా కాంగ్రెస్ తో పాటు, టిడిపి, జగన్ పార్టీలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టి తెలంగాణాలో సూపర్ పవర్ గా ఎదగాలని పధక రచన చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకొని మిగిలిన పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసి, తెలంగాణాలో ఏకైక ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ను నిలపాలని కూడా కెసిఆర్ ఆలోచన చేస్తున్నారు. అలాగే, తెలంగాణా విషయంలో కాంగ్రెస్ ఇప్పట్లో ఓ నిర్ణయానికి రాలేదని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంఫై ప్రజల్లో వ్యతిరేకత ఉందని,ఈ కారణాల వల్ల వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ తనకు ఎంత మాత్రం పోటీ కాదని భావిస్తున్న కెసిఆర్ ఇక టిడిపి, జగన్ పార్టీల పని పట్టాలని ఆలోచన చేస్తున్నారు.

 

కొత్తగా ఎదుగుతున్న జగన్ పార్టీని, తెలంగాణాలో కాస్త బలంగా ఉండే టిడిపి ని ఈ ప్రాంతంలో నిలువరించగలిగితే, ఇక తనకు ఎదురు ఉండదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు ఈ సమావేశంలో ఏమి చెప్పినా ఎదురు దాడి చేయాలని ఇప్పటికే ఆయన తన పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.

 

ఇక కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందని తెలంగాణా కాంగ్రెస్ నేతలే ఇవ్వలేకపోతున్న్డ దశలో వారంతా తన పార్టీలో ఎన్నికలనాటికి చేరే అవకాశం ఉందని కెసిఆర్ ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ఈ చేరికలతో టిఆర్ఎస్ మరింత శక్తివంతం అవుతుందని కెసిఆర్ భావిస్తున్నారు.

 

ఏది ఎలా ఉన్నా, ఈ సమావేశంలో ఈ మూడు పార్టీలు అవలంభించే వైఖరిని అనుసరించే కెసిఆర్ తన రాజకీయ ఎత్తుగడలు వేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.