అత్యాచార భాదితురాలిని రేప్ చేసిన పోలీసులు

 

ఒక వైపు ‘దామిని’ (డిల్లీ బాదితురాలికి, ఆందోళనచేస్తున్న యువత పెట్టుకొన్న పేరు.) సామూహిక అత్యాచారం పై డిల్లీ నగరం అట్టుడికిపోతున్న ఈ తరుణంలో అంతకంటే హీనాతిహీనమయిన సంఘటనలు ఒక్కొకటిగా నిత్యం వెలుగులోకి వస్తూనేఉన్నాయి.

 

ఒక కుటుంబం తనకు అడిగినప్పుడు ఆహారం ఈయనందుకు పగబట్టి, ఇంట్లో అక్కపక్కలోనిద్రిస్తున్న పాపం,పుణ్యం తెలియని ఐదు సం.ల పసిపిల్లని ఒక క్రూర మగమృగం ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేయగా, మన ఊరి పెద్దాయనే అని నమ్మి స్కూటరు ఎక్కి ఇంటికి జేరుకోవలనుకొన్న ఒక 7వ క్లాసు చదివే విద్యార్దిని ఘోరంగా బలత్కారింపబడింది. మణిపూర్ రాష్ట్రంలో అందరి ముందూ ఒక అధికారి సినిమా నటితో అసభ్యంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చెడు.

 

మదమెక్కిన మగాళ్ళు ఇలాగ ప్రవర్తిస్తుంటే, అటువంటి వారిని కటినంగా శిక్షించాల్సిన మన రక్షకబటులు స్వయంగా ఆ నేరానికి పాల్పడుతూ ఇక ప్రజలు ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలీని పరిస్తితిని కల్పిస్తున్నారు.

 

కంచే చేను మేసినట్లు గా కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. గత నెల నవంబరులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువతిని కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేసారు. తీవ్ర మానసిక శారీరిక క్షోభ అనుభవిస్తున్న ఆమె కుటుంబం దైర్యంచేసి అంబేద్కర్ నగర్ లో ఉన్న పోలీసుస్టేషనులో పిర్యాదు చేసారు. అయితే, అక్కడా కొన్ని మగ మృగాలున్నాయని ఆమెకి, ఆమె కుటుంభ సభ్య్యులకీ తెలియదు పాపం. ఒకవేళ, తెలిసుంటే అసలు పిర్యాదే చేసిఉండేవారు కాదేమో.

 

స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ దృష్టి ఆమెపై పడింది. కొన్ని రోజులు స్టేషన్ చుట్టూ ఆమెను తిపించుకోన్నాక, “నీకేసును ఫజియబాదులో ఉన్న డి.ఐ.జి.గారికి చెప్పుకొన్నట్లయితే దోషులకు వెంటనే శిక్షపడేలా చేయోచ్చు” అని పోలీసు ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ చెప్పినప్పుడు అతనిని అమాయకంగా నమ్మిన ఆ యువతి అతని పోలీస్ జీప్ ఎక్కింది. ఆమెను ఫజియాబాద్ కు బదులు స్థానిక హోటల్ కి తీసుకువెళ్లి ఆమెను బలాత్కారం చేసాడు. అతనితో బాటు వచ్చిన అక్బరాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ ఎ.కె. ఉపాద్యాయ్ కూడా ఆమెపై అత్యాచారం చేసాడు. తనను కాపాడవలసిన ఇద్దరు రక్షక భటుల చేతుల్లోనే మరోమారు తానూ అత్యాచారానికి గురవడం ఆ యువతికి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. అయితే, ఆఖరు ప్రయత్నంగా ఎలాగో వీలుచూసుకొని అదే ఊరులో ఉన్న తన స్నేహితురాలికి తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా తన పరిస్తితి తెలియజేస్తూ కాపాడవలసినదిగా మెసేజ్ పంపగలిగింది. అది అందుకొన్న ఆమె స్నేహితురాలు వెంటనే పోలీసు ఆఫీసరు (యస్.యస్.పి.) డి.యస్. యాదవ్ ను అప్రమత్తం చేయగానే, ఆయన తన సిబ్బందిని తీసుకొని ఆ యువతిపై అత్యాచారం జరుగుతున్నహోటల్ కి చేరుకొని, ఇంకా తమ మధనఖండాని కొనసాగిస్తున్న తన ఇద్దరు పోలీసు ఆఫీసరులను పట్టుకొన్నారు.

 

అయితే, ఆ యువతి అప్పటికి పోలీసు కబంధ హస్తాలలోంచి బయట పడగలిగింది. గానీ, తనపై అత్యాచారం చేసిన ఇద్దరు పోలీసు ఆఫీసరులకు శిక్ష పడేలా మాత్రం చేయలేకపోయింది. నేరస్తులిద్దరూ పోలీసు శాఖకే చెందినవారయి ఉండటమే దానికి కారణం. ఆమె ఇప్పుడు ఇక ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియక ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కే నేరుగా ఒక లేఖ వ్రాసి తనగోడు వెళ్ళబోసుకోంది. అయితే, ముఖ్యమంత్రి ఇంకా స్పందిచేడా లేదా అనేది ఇంకా తెలియలేదు.

 

ఇటువంటి దయనీయ పరిస్తితుల్లోకి నెట్టిన కిరాతుకులను నిందించాలో లేక తనను కాపాడవలసిన వారే కభళించిన రక్షకభటులని శిక్షించాలని అడగాలో ఆమెకి తెలియట్లేదు.

 

డిల్లీలో జరిగిన అన్యాయాన్ని వేలదిగొంతులు ఖండిస్తూ దోషులకు ఉరిశిక్ష వేయవలసిందే అని ఉద్యమిస్తుండగా, మరోపక్క ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ అబల ఒంటరిపోరాటం చేస్తోందిప్పుడు. ఆమెకి మద్దతుగా ఒక్క గొంతుకూడా ఎందుకు పలకట్లేదో మరితెలియదు. ఎవరి మద్దతూ దొరకని అటువంటి వారికి న్యాయం జరగుతుందని అనుకోలేము. ఎందుకంటే, కుల రాజకీయాలు చేయడంలో మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన ఉత్తరప్రదేశ్ లో ‘మనోడయితే’ ఇక ఏ నిబందనలూ అతనిని ఏమి చేయలేవు.

 

కొసమెరుపు ఏమిటంటే నిన్న రాత్రి మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణగారు అసలు “ఆడవాళ్ళూ ఎప్పుడు ఇంట్లో ఉండాలో ఎప్పుడు వీధులోకి రావచ్చునో తెలుసుకోకపోతే ఎలాగా” అని అసహనం వ్యక్తం చేసారు. అంతేగాకుండా “స్వాతంత్రం వచ్చిందకదాని అర్ధరాత్రీ అపరాత్రీ చూడకుండా ఆడవాళ్ళూ వీధులోకి వస్తే మరిలాగే ఉంటుంది పరిస్తితి” అని కూడా ఉద్బోదించారు. అయినా, జరిగినది “చిన్నసంఘటనే” అయినప్పటికీ తమ పార్టీ నేత స్వయంగా, అర్ధరాత్రి అనికూడా చూడకుండా వీధుల్లోకివచ్చి ఉద్యమం చేస్తున్న విద్యార్దులతో మాట్లాడటం అంటే గొప్పవిషయమే కదా అని ప్రజలని ప్రస్నించేరు ఆయన. ఇటువంటి నేతలు, పోలీసు వ్యవస్థా మనకున్నపుడు మనం గర్వపడక ఆందోళనలు చేయడం అవివేకం కాదా?